మహిళా సమస్యలపై టి-సాట్ స్టూడియో వేదికగా జరిగిన ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసార కార్యక్రమంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి

మహిళల పట్ల మగవారి ఆలోచనల్లో మార్పు రావాలి
• సంవత్సర కాలంలో 65 శాతం సమస్యలకు పరిష్కారం
• పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిన అవసరం లేదు…కాల్ చేస్తే చాలు
• మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
(టి.సాట్-సాఫ్ట్ నెట్)
మహిళల పట్ల మగవారి ఆలోచన విధానాల్లో మార్పు రావాలని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్పు ఇంటి నుండి మొదలై సమాజ మార్పునకు దోహదపడాలని సూచించారు. మహిళా సమస్యలపై టి-సాట్ స్టూడియో వేదికగా జరిగిన ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసార కార్యక్రమంలో సునీతాలక్ష్మారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
టి-సాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి తొలుత తన కార్యాలయంలో టి-సాట్ నిర్వహణ తీరుపై ఛైర్ పర్సన్ కు వివరించారు. అనంతరం జరిగిన లైవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళలు ప్రతి పనికీ మగవారిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదిగే నైపుణ్యాన్ని, స్వీయరక్షణ పెంచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ధతో మహిళా కమిషన్ ఏర్పాటు చేసి మహిళలకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. కమిషన్ ఏర్పడిన సంవత్సర కాలంలో 492 సమస్యలు కమిషన్ దృష్టికి రాగా 306 సమస్యలకు పరిష్కారం చూపామని, 50 జంటలు కౌన్సిలింగ్ కోసం వస్తే 30 జంటల ఇబ్బందులు పరిష్కరించి వారి కుటుంబాలు కలిసి జీవించేలా కమిషన్ పనిచేసిందన్నారు. పోలీసు స్టేషన్లలో మహిళల్ని విచారించే సమయం సాయంత్రం ఆరు గంటల లోపే ఉండాలని ఫోన్ కాలర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ పోలీసు శాఖ డిజితో మాట్లాడి సమయ వేళ్లల్లో ఖచ్చితమైన ఆదేశాలివ్వాలని సూచిస్తానని చెప్పారు. జిల్లాల్లో షీ టీమ్స్ పెంచాలని, ఉమెన్ జైల్స్ తదితర మహిళలకు సంబంధించిన రక్షణ విషయాల్లో ఇప్పటికే పోలీసు శాఖకు పలు సూచనలు చేశామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో సఖి కేంద్రాలున్నాయని, మహిళలు పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా 181 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి తమ సమస్య చెప్పుకోవచ్చని సూచించారు. ‘ఆడిపిల్ల వద్దనే భావన నుండి ఆడపిల్ల ముద్దు’ అనే అభిప్రాయానికి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను చైతన్య పరిచిందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారితో పాటు కమిషన్ సెక్రటరీ కృష్ణ కుమారి గారు, లీగల్ కౌన్సిలర్ సునీత దేవి గారు పాల్గొన్నారు.

Share This Post