మాత శిశు సంరక్షణ కేంద్రంలో15 నుండి 18  సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం ఆస్పత్రిలో బాలింతలకు కెసిఆర్ కిట్టు ను అందజేస్తున్న రాష్ట్ర పౌర సరఫరాలు & బి.సి సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్

జిల్లాలో కోవిడ్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు

రాష్ట్రం, దేశం నుండి కోవిడ్ ను పారదోలుటకు కృషి

జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల పిల్లలందరికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించాలి

ఒమిక్రాన్ రాకుండా పకడ్బంధీ చర్యలు

రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
00000

జిల్లాలో కోవిడ్ నియంత్రణకు 15 నుండి 18 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

సోమవారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షన కేంద్రంలో 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమమును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సోమవారం నుండి జిల్లాలో 15 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక కమ్యూనిటి హెల్త్ సెంటర్, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మొత్తం 26 సెంటర్లలో 15-18 సంవత్సరాల యువతకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల 64 వేల మంది యువతను కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి గుర్తించామని, వారందరికి కోవాగ్జిన్ కరోనా టీకా మొదటి డోస్ వేయాలని వైద్య సిబ్బందిని మంత్రి ఆదేశించారు. 28 రోజుల తర్వాత తిరిగి రెండవ డోస్ వేయాలని అన్నారు. గుర్తించిన వారందరికి కరోనా టీకా వేయించుటకు తల్లిదండ్రులు, గురుకుల పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలని అన్నారు. గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ టీకా వేయించుటకు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, కోవిడ్ టీకాను జిల్లాలో విజయవంతంగా అర్హులైన వారందరికి ఇప్పించినందులకు జిల్లా యంత్రాంగానికి, వైద్య సిబ్బందికి మంత్రి కృతఙ్ఞతలు, అభినందనలు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు దినదినం పెరుగుచున్నందున కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు తెలుపుచున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలో కోవిడ్ నివారణకు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నామని, అన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్, వెంటిలేటర్, మెడికల్ ఎక్విప్ మెంట్, ఆసుపత్రులల్లో అన్ని సదుపాయాలు సమకూర్చామని తెలిపారు. కోవిడ్ నివారణకు అవసరమైన మందులు, ఇంజక్షన్ లు సిద్దంగా నిల్వ ఉంచారని తెలిపారు. కోవిడ్ సంపూర్ణ నివారణకు ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటిచాలని, తరచుగా చేతులను శుభ్రపర్చుకోవాలని అన్నారు. తద్వారా జిల్లాకు ఒమిక్రాన్ రాకుండా చూడాలని మంత్రి అన్నారు.

అనంతరం మంత్రి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశ నిర్వహించి కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ నివారణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తదుపరి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బాలింతలకు అందుతున్న వైద్య సేవలను వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలింతలకు కేసిఆర్ కిట్ ను అందజేశారు.

 

Share This Post