మానేరులో విద్యార్థుల గల్లంతు దురదృష్టకరమైన సంఘటన:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16: సిరిసిల్ల మానేరు చెక్ డ్యాం వద్ద సోమవారం ఆరుగురు విద్యార్థులు దురదృష్టవశాత్తు వీటిలో గల్లంతు అవ్వడం అందరినీ కలచివేసిందని, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం నాటికి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కు చెందిన కొలిపాక గణేష్, జడల వెంకటసాయి, తీగల అజయ్, కొంగ రాకేష్, శ్రీరాం కాంతికుమార్ అనే ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమవగా, సింగం మనోజ్ అనే విద్యార్ధి ఆచూకి ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటన పట్ల జిల్లా యంత్రాంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. ఇట్టి విషయాన్ని ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామాత్యులు కె. తారకరామారావు గారు ఫోన్ ద్వారా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారని ఆయన తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వివరించడం జరిగిందని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

Share This Post