మారుమూల ప్రాంతాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ఆదివారం పినపాక నియోజకవర్గ పరిధిలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టనున్న కరకగూడెం మండలం చొప్పాల గ్రామంలో 2.58 కోట్లతో అనంతారం ఆర్ అండ్ బి రోడ్డు నుండి వయా కొత్తూరు. మధ్య ముక్కోటివాగుపై నిర్మించనున్న వంతెన నిర్మాణ పనులకు, మోతే గ్రామంలో 4.50 కోట్లతో నిర్మించనున్న పెద్దవాగుపై నిర్మించనున్న వంతెన నిర్మాణ పనులకు, పినపాక మండలంలోని బయ్యారం నుండి బెస్తగూడెం వయా పాతరెడ్డిపాలం, వెంకట్రావుపేట, జగ్గారం మీదుగా 3.11 కోట్లతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు మహాబూబాద్ పార్లమెంటు సభ్యులు మాళోత్ కవిత, పినపాక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలతో కలిసి శంఖుస్థాపనలు చేశారు. అనంతరం గా కాంతారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో ఏజన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గం దూసుకుపోతున్నదని, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో పర్యటించాలంటే సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడ్డామని నేడు పరిస్థితి నుండి అభివృద్ధికి చిరునామాగా మారిందని చెప్పారు. ఏజన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందిస్తున్నామని, గతంలో లో ఓల్టేజి సమస్యతో మోటార్లు కాలిపోయేవని నేడు ఆ పరిస్థితి నుండి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. రైతుకు పంట పెట్టుబడికి రెండు విడతలుగా ఎకరాకు 10 వేల రూపాయలు చెల్లిస్తున్నామని ఇందుకోసం ప్రభుత్వం సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధి చేపట్టగా భూ గర్భ జలాలు సైతం పెరిగాయని, వ్యవసాయానికి సమృద్ధిగా నీరు అందుతున్నట్లు చెప్పారు. ఇట్టి చర్యలు ఫలితంగా మన రాష్ట్రం వ్యవసాయరంగంలో దూసుకుపోతున్నదని, వానాకాలం, యాసంగిలో మన రాష్ట్రం నుండి 3 కోట్ల మెట్రిక్ టన్నులు దాన్యం పండిస్తున్నట్లు చెప్పారు. సురక్షిత మంచినీరు లభించక ప్రజలు ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నట్లు గమనించిన ప్రభుత్వం మిషన్ బగీరథ చేపట్టి ప్రతి ఇంటికి నేడు సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నామని ఫలితంగా వ్యాధులు సైతం తగ్గినట్లు వివరించారు. యాసంగిలో భారత ఆహార సంస్థ దాన్యం కొనుగోలు చేయమని చెప్పినందున, రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతువేదికల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రైతులు కూడా ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటిస్తున్నందుకు అభినందించారు. స్వంత అవసరాల కొరకు కానీ, విత్తన కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే తప్ప రైతులు వరి సాగు చేపట్టొద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, కానీ మన రాష్ట్రానికి వచ్చే వరకు అన్ని కొర్రీలు పెడుతూ ధాన్యం కొనుగోలు చేయమని చెప్పారని ఆయన స్పష్టం చేశారు. యాసంగిలో పండిన ధాన్యం పారాబాయిల్డ్ రైస్‌కు ఉపయోగపడతాయని కాబట్టి ధాన్యం కొనుగోలు చేయమని భారత ఆహార సంస్థ చెప్తున్నారని, కానీ పారాబాయిల్డ్ రైస్ మిల్లులు ఏర్పాటు చేసింది ఎఫ్ సిబ అని చెప్పారు. అందువల్ల రైతులు యాసంగిలో వరికి బదులు లాభదాయకమైన పంటల సాగు చేపట్టాలని ఆయన సూచించారు. పినపాక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ వర్షాకాలంలో ఈ ప్రాంతంలో మంత్రి పర్యటించినపుడు వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఒక వంతెన కూలిపోయినట్లు దృష్టికి తేగా తక్షణమే నిధులు మంజూరు చేయించారని చెప్పారు. రవాణా సౌకర్యం లేని గ్రామాలున్నాయని, అధిక నిధులు కేటాయించు విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా నుండి ఇపుడిపుడే చక్కబడుతున్నామని, అభివృద్ధిని వేగవంతం చేస్తామని చెప్పారు. అంతర్గత రహదారుల అభివృద్ధికి జడ్పీ నుండి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాంతంలో పామాయిల్ సాగును చేపట్టేందుకు రైతులు సన్నద్ధంగా ఉన్నారని, అశ్వాపురం మండలంలో 100 ఎకరాల్లో ఆయిల్ పామ్ పరిశ్రమతో పాటు ఆయిల్‌పామ్ నర్సరీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

మహబూబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత, జడ్పీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో ఏఎస్సీ శబరీష్, పంచాయతీరాజ్ సిఈ జి. సీతారాములు, జడ్పీటిసి నరసింహారావు, సర్పంచులు, యంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post