మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంట మార్పిడి పద్ధతులు పాటించాలి అవగాహన సదస్సులో మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి

సాంప్రదాయంగా వస్తున్న పంటల సాగుకు స్వస్తి పలుకుతూ, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులకు హితవు పలికారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో పంటల సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు వీలుగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మాక్లూర్ మండలం మామిడిపల్లి లోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో గల కళ్యాణ మండపంలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరవగా, జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కెఆర్ సురేష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, ఎం ఎల్ సి వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యేలు హన్మంత్ సిందే, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు సి నారాయణ రెడ్డి, జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, కాలానికి అనుగుణంగా మార్పులను స్వాగతిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. నూతన పద్ధతుల్లో పంటల సాగు చేపటలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సూచించారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతుని మించిన శాస్త్రవేత్త లేడని, వారికి కాస్తంత ఊతమందిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. వరి వంటి సాంప్రదాయ పంటలకు భిన్నంగా మార్కెట్ అవసరాలను గమనిస్తూ డిమాండ్ ఉన్న పంటలను ఆధునిక పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో పండిస్తూ, ఎక్కువ దిగుబడులు సాధించి లాభాల బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా రైతులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులను నిర్వహిస్తోందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం, ప్రత్యేకించి అన్నదాత శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అహరహం కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో 60 శాతం మందికి పైగా జనాభాకు ఉపాధి కల్పిస్తున్న సేద్యపు రంగానికి మహర్దశ చేకూర్చాలనే తపనతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దారని కొనియాడారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు గడిచిన ఏడేళ్ల కాలంలోనే 3 లక్షల 75 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని, రైతుబంధు కింద పంటల సాగుకు పెట్టుబడిని అందిస్తున్నామని, వేలాది కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి వనరులను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. సాగు రంగానికి ఇతోధికంగా ప్రభుత్వ తోడ్పాటు అందడంతో తెలంగాణలో భూముల ధరలు గణనీయంగా పెరిగాయన్నారు. విద్యుత్తు తలసరి వినియోగంలో, వ్యవసాయ ఉత్పత్తులలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఈ సూచిక లే నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిద్దిదేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
స్థానిక పరిస్థితులకు తగినట్టుగా కార్యచరణ ప్రణాళికను రూపొందించి, క్షేత్ర స్థాయిలో అమలు అయ్యే విధంగా పని చేయాలని అధికారులకు సూచించారు. ఒకే పంటని వేయడం వలన భూసారం తగ్గిపోయి దిగుబడి తగ్గుతుందని అన్నారు. పంట మార్పిడి చేపట్టి లాభదాయక సాగుకు ప్రాధాన్యత ఇస్తూ దిగుబడి పెంచే దిశగా కృషి చేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా కృషి చేయాలని అన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి పై విజయ గాధలను అందించాలని అన్నారు . ఇదిలావుండగా, పసుపు పంటకు గిట్టుబాటు ధర కోసం మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని, నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం పునరుద్ధరణ కు సంబంధించి ముందుగా మహారాష్ట్ర లోని కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లను అధ్యయనం చేయిస్తామని అన్నారు. అధ్యయన నివేదికను అనుసరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ దేశంలో రైతు గురించి 24 గంటలు ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని అన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చారని అన్నారు. ఇది వరకు పంటలు సాగవుతాయో లేదోనని రైతులు మీమాంసలో కొట్టుమిట్టాడేవారని, రైతులకు గతంలో పిల్లను ఇచ్చేందుకు కూడా వెనుకంజ వేసేవారని అన్నారు. అలాంటి పరిస్థితి నుండి ప్రస్తుతం సాఫ్టువేర్ ఉద్యోగాలను పక్కన పెట్టి రైతుకు పిల్లను ఇచ్చేందుకు పోటీ పడే స్థాయికి సేద్యపు రంగం అభివృద్ధి చెందిందని అన్నారు. ఇదివరకు తెలంగాణాలో వ్యవసాయానికి ఏడు గంటల కరంటు మూడు విడతలు ఇచ్చేవారని, విత్తనాలు, ఎరువుల కోసం చెప్పులు వరుస క్రమంలో పెట్టి రైతులు క్యూ లో నిలబడేవారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత ఏడేళ్ల స్వల్ప వ్యవధిలోనే నేడు 24 గంటల కరంటు, కాళేశ్వరంతో సాగునీళ్లిచ్చి వ్యవసాయాన్నిదేశంలోనే అగ్రపథంలో నిలిపారని అన్నారు. ప్రస్తుత మందు వేసవిలోనూ గుత్ప, ఆలీసాగర్ ద్వారా కాలువలు పారుతున్నాయి .. చెరువులు అలుగు దుంకుతున్నాయనిహర్షాతిరేకాలు వెలిబుచ్చారు.కేసీఆర్ ముందుచూపు ఫలితంగా నేడు 2.4 కోట్ల ఎకరాలలో పంటల సాగవుతున్నాయని, 70 లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తగా సాగులోకి వచ్చిందన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో 18 లక్షల ఎకరాలలో పంటలు పండుతుండగా, అందులో 12 లక్షల ఎకరాలలో ఒక్క వరి పంటనే సాగు చేస్తున్నారని, దీనివల్ల ఆశించిన స్థాయిలో మద్దతు ధర పెరుగక లాభాలు సమకూరడం లేదన్నారు.
ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాల వరిని 5 లక్షలకు తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు. నాణ్యమైన, మేలురకానికి చెందిన సోయాబీన్ విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచితే వరికి ప్రత్యామ్నాయంగా సోయా సాగు కోసం రైతులను ఒప్పించే బాధ్యత తమదేనని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోయాతో పాటు
శనగలు, కందుల సాగును ఉమ్మడి జిల్లాలో పెంచే అవకాశం ఉందన్నారు. కాగా,పసుపు సాగును ఇక్కడి రైతులు లక్ష్మిగా భావిస్తారని, పసుపు రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. పసుపు సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గేలా, పసుపు దిగుబడి పెరిగేలా శాస్త్రవేత్తలు సాయం అందించాలని, అలాగే రబీలో నూక ఏర్పడిన వరి పంట సాగుకు అనుకూలించేలా నూతన వంగడాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి జరిపితే యావత్ దేశం దృష్టిని ఆకర్షించవచ్చని సూచించారు. అభ్యుదయ, ఆదర్శ రైతులు కలిగిన జిల్లా కావడం వల్ల పంట ఉత్పత్తులు పెద్ద ఎత్తున వస్తున్నందున అదనంగా మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు.
5 వేల మెట్రిక్ టన్నుల సామర్ద్యం గల రైస్ మిల్లులు ఏర్పాటు చేయాలని, దాల్ మిల్ లను, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తెచ్చారు.
రాష్ట్ర రైతుబంధు సమితి ఛైర్మన్, ఎమ్.ఎల్.సి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గత ఎనిమిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం లో వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను, అభివృద్ధిని వివరించారు. ఆధునికత విషయాలపై రైతులకు సరైన దిశగా అవగాహన కలిపించాలని అధికారులకు సూచించారు.
వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునంధన్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నీళ్లు,నిధులు నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా శాస్త్రీయంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతోందని అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు మరింత చిత్తశుద్ధితో పని చేస్తేనే ముఖ్య మంత్రి గారు ఆశించిన ప్రగతిని సాదించగలమని అన్నారు. వ్యవసాయానికి సంబందించిన అనేక అంశాలలో మరింత మెరుగైన మార్పును సాధించగలమని అన్నారు. క్రాఫ్ బుకింగ్ సర్వే నెంబర్ వారిగా చేపట్టాలని రైతు వేదికలలోనే అన్నీ సమావేశాలను నిర్వహించాలని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికార్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
నిజామాబాదు కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సేద్యం దిశగా రైతులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభుత్వం అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని అన్నారు. రైతులతో రైతు బంధు సమితి సభ్యులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయని, అందువల్లే ఈ సదస్సులలో వారికి పంటల సాగు యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆకళింపు చేసుకుని, తమతమ ప్రాంతాల రైతులకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తూ వారిని ఆధునిక సాగు, పంటల మార్పిడి దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు.
ఈ సదస్సులో మార్క్ ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ ఆకుల లలిత, డీ సి సి బీ చైర్మన్ భాస్కర్ రెడ్డి,ఐడిసిఎంఎస్ చైర్మన్ మోహన్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
———————–

Share This Post