మార్కెట్ యార్డులో రైతులకు సేవలు అందించండి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

పత్తి రైతులకు సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం రైతులకు సహాయసహకారాలు అందించేందుకు రొటేషన్ పద్దతిలో సిబ్బందిని నియమించడం జరిగిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం రోజున వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి విక్రయల తీరును ఆయన పరిశీలించారు. రైతులకు అన్యాయం జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. తేమ కొలిచే శాతంలో వ్యత్యాసం వస్తున్నదని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా, తేమ కొలిచే యంత్రాలను సమర్థవంతంగా పనిచేసే విధంగా, ఎలాంటి వ్యత్యాసాలకు తావులేకుండా సక్రమంగా కొలవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. రైతులకు న్యాయం చేసే విధంగా జిల్లా యంత్రాంగం పని చేస్తున్నదని, ఐకేపీ, రెవెన్యూ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖల సిబ్బందితో టీమ్ లను ఏర్పాటు చేసి రైతులకు సేవలందిస్తున్నామని తెలిపారు. జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి పత్తి రైతులకు ఎలాంటి అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి వివిధ శాఖల సిబ్బందికి కేటాయించిన విధులలో నిర్లక్ష్యం వహించకుండా చూడాలని అన్నారు. రైతుల పట్ల సేవాభావం కలిగి ఉండాలని సూచించారు. అనంతరం స్థానిక గణేష్ జిన్నింగ్ మిల్లులో తేమ కొలిచే విధానం, పత్తి తూకం వేసే యంత్రాన్ని, ప్రెస్సింగ్ యూనిట్, పత్తి నుండి గింజను వేరుచేసే విధానాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. మొదటి రోజున 10,871 క్వింటాళ్ల పత్తి మార్కెట్ కు రావడం జరిగిందని అందులో 75 శాతం పత్తి 8 నుండి 12 శాతం కలిగి, మిగతా 25 శాతం 13 శాతం కన్నా పైన కలిగి ఉందని తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రమేష్, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post