భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎలాంటి ఆయుధం లేకుండా కేవలం అహింస మార్గం ద్వారా పోరాడి స్వాతంత్య్రం సాధించిన మాహాత్మాగాంధీ చెప్పిన, చూపిన ఆదర్శాలు, సిద్దాంతాలు చాలా గొప్పవని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో గాంధీ జయంతి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్‌తో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో జాతిపిత మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ కీలకపాత్ర పోషించారని, అహింస, సత్యాగ్రహం లాంటి శాంతియుత పోరాటాల ద్వారా దేశానికి స్వాతంత్య్రం సంపాదించారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా సాయుధ పోరాటమే జరిగిందని, గాంధీజీ అనుసరించిన అహింసా మార్గంతో భారతదేశంలో సాయుధ పోరాటం లేకుండా శాంతియుతంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్నామని అన్నారు. ఇదే స్ఫూర్తితో దక్షిణాఫ్రికా దేశంలో నెల్సన్ మండేలా నాయకత్వంలో అహింసా మార్గంలోనే స్వాతంత్య్రం సాధించుకున్నారని తెలిపారు. సమాజంలో సమస్యలు ఎన్ని ఉన్నా రాజ్యాంగం ప్రకారంగా, మహాత్మా గాంధీ నమ్మిన సిద్దాంతాన్ని అనుసరిస్తూ కలిసి పరిష్కరించుకోవాలని, కుల, మత, వర్ద, వర్ణ విబేధాలకు అతీతంగా మనమందరం కలిసి ఉండాలని తెలిపారు. గాంధీజీ చూపిన ఆదర్శాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్చ భారత్, స్వచ్చ తెలంగాణ, హరితహారం లాంటి అనేక రకాల పథకాలతో ప్రస్తుతం అమలు చేస్తున్నాయని, ప్రపంచంలో, సమాజంలో మార్చు రావాలంటే ముందు మనలో మార్పు రావాలని, మన ఇంటి నుండి మార్పు ప్రారంభమవ్వాలని తెలిపారు. గాంధీజీ చెప్పిన, అనుసరించిన ఆదర్శాలు, సిద్దాంతాలు చాలా గొప్పవని, ఆ దిశగా మనం కలిసి నడవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి సురేష్, పర్యవేక్షకులు సంతోష్, జిల్లా పౌరసంబంధాల అధికారి
వై.సంపత్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.