మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థం-2*
రాజన్న సిరిసిల్ల, జనవరి 4: మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు యూనిట్ కు 2 వేల డెయిరీ యూనిట్లు మంజూరయినట్లు, ఒక్కో యూనిట్ ధర 2 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. యూనిట్ ధరలో 70 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు ఋణం ఉంటుందన్నారు. లబ్ధిదారుల గుర్తింపు, నమోదు ఇతర ఆర్థిక చేయూత పథకాల్లో అనుసరించిన విధంగానే చేపట్టాలన్నారు. పాల మార్కెటింగ్ కొరకు ఏదేని డెయిరీ అభివృద్ధి సంస్థ తో ఒప్పందం చేసుకోవాలన్నారు. డెయిరీ అభివృద్ధి సంస్థలు పాల అమ్మకానికి పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. డెయిరీ పట్ల అవగాహన కొరకు లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఎంపిక చేయబడిన లబ్ధిదారులు డెయిరీ సొసైటీలుగా నమోదవ్వాలన్నారు. పశు సంవర్థక శాఖ ద్వారా గేదెల సంరక్షణపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులు, జిల్లా ఎస్సి సొసైటీలు, పశు సంవర్థక శాఖ, డెయిరీ అభివృద్ధి సంస్థలు, బ్యాంకర్లు సమన్వయంతో డెయిరీ ప్రాజెక్టును విజయవంతం చేయాలన్నారు. ఎస్సిల అభివృద్ధి కొరకు ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ క్రింద మంజూరయిన యూనిట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లక్ష్యం పూర్తి చేయాలన్నారు.
*ఉపాధిహామీ పనుల లక్ష్యాన్ని పూర్తి చేయాలి*
ఉపాధిహామీ పధకంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. గ్రామానికి 50 మందికి తగ్గకుండా ఉపాధిహామీ కూలీలను సమీకరించాలన్నారు. నర్సరీల్లో డిమాండ్ మేరకు మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హరితహారం క్రింద నాటిన ప్రతి మొక్క సంరక్షించబడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంజూరయిన రైతు పంట కళ్లాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వినోద్ కుమార్, డీఆర్డీఓ కె. కౌటిల్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ రంగారెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ మదన్ మోహన్, ఎంపీడీఓ లు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post