ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, హరితహారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

పత్రిక ప్రకటన

తేదీ : 30–05–2022

హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో హరితహారం పెంచేందుకు చర్యలు

ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, హరితహారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారని ఈ విషయంలో ఆయన ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నారని అందుకు ప్రతి ఒక్కరు సహకరించి విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరీశ్, జడ్పీ ఛైర్మన్ శరత్చంద్రారెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై మున్సిపాలిటీల్లో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అందుకు ఆయా మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, ప్రత్యేక శ్రద్ధతో పాటు అందరూ కలిసి సమన్వయంతో పని చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని వివరించారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందడానికి ఇది ఎంతో గొప్ప  అవకాశమని జిల్లాలో ఉన్న 61 గ్రామపంచాయతీల్లో హరితహారం, పల్లె ప్రగతి, కార్యక్రమాలు  ఎంతో బాగా కొనసాగుతున్నా మున్సిపాలిటీల్లో అంత గా  జరగడంలేదని అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. జిల్లాలోని ఆయా పట్టణాల్లో హరితహారం పెంచేందుకు కృషి చేయాలని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరమైన చోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి అధికారులకు సూచించారు. మూడు లేయర్లలో మొక్కలను నాటాలని… పచ్చదనం పెంచాలని అన్నారు. హరితహారంతో పాటు అన్ని రంగాల్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాను రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచాలని అందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. అలాగే ఈనెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో మమేకమై తప్పకుండా పాల్గొనాలని ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ తగదని ప్రజలకు సేవ చేసే అదృష్టం తమకు దక్కిందనే ఉద్దేశం, సంకల్పంతో పనులు చేయాలని అన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు చేసే పనులు ప్రతి ఒక్కరు గుర్తించే విధంగా ఆ పనులను పది కాలాల పాటు ప్రజల మనస్సులో నిలిచిపోయేలా చేయాలని మంత్రి మల్లారెడ్డి హితవు పలికారు. దీంతో పాటు పట్టణ ప్రగతి విషయంలో ఛైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు సరిగ్గా పని చేయాలని… వారు పని చేయకపోతే వారిపై తగిన చర్యలు (యాక్షన్) తీసుకునేందుకు జిల్లా కలెక్టర్కు పూర్తి అధికారాలు ఇచ్చారని దీనిని దృష్టిలో ఉంచుకొని పనులు చేస్తే ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా ప్రజాప్రతినిధులకు కూడా మంచిపేరు వస్తుందని మంత్రి వివరించారు. అలాగే ప్రభుత్వం సూచించిన చోట్ల క్రీడా మైదానాలను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని… అందుకు క్రీడామైదానాల త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి వివరించారు. జిల్లాలోని పోచారం మున్సిపాలిటీకి హరితహారంలో ప్రథమ బహుమతి లభించిందని అదే స్ఫూర్తితో మిగిలిన మున్సిపాలిటీలు తమకు గుర్తింపు వచ్చేలా పోటీపడి బహుమతులు సాధించాలని ఈ విషయంలో ప్రభుత్వ సహకారంతో పాటు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటాలని అవసరమైతే మొక్కలను నర్సరీల నుంచి తెప్పించుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, కింది స్థాయి ఉద్యోగులు ముందస్తు ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) తయారు చేసుకోవాలని అందుకు గ్రీన్ బడ్జెట్ వాడుకోవాలని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకొన్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆరు నుంచి ఏడు శాతం పచ్చదనం పెరిగినట్లు భారత ప్రభుత్వం (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) తెలిపిందని… ఇదే స్ఫూర్తితో పచ్చదనం పెంపొందించేందుకు మరింత అవసరమైన కార్యాచరణతో ముందుకెళ్ళాలని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. అలాగే గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతివనాలు, నర్సరీలు ఉండేలా చూడాలన్నారు. దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో 19 మనవే. 10 కి 10 ఆదర్శ గ్రామాలు కూడా మనవే అని తెలిపినారు  అలాగే హరితహారం కార్యక్రమంపై మరింత దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ హరీశ్ సమావేశంలో స్పష్టం చేశారు.

జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సమన్వయంతో కలిసి విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని దానిని ఒక బాధ్యతగా తీసుకొని తమ విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లా అన్ని రంగాల్లో ముందు స్థానంలో ఉంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post