బుధవారం నాడు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని రైతు వేదిక భవనంలో దళిత బంధు లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆమె ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి దివ్య, రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి శ్రీమతి ప్రియాంక వర్గీస్, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి లతో కలిసి పాల్గొన్నారు.
కెసిఆర్ దార్శనికతతో దళిత బంధు ప్రవేశపెట్టి మా జీవితాలలో వెలుగులు నింపారని, ఎన్ని జన్మలెత్తినా ఆయన ఋణం తీర్చుకోలేనిదని దళిత బంధు లబ్ధిదారులు గ్రామ సభలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, తాము ఎంచుకున్న జీవనోపాదుల రంగాలను వివరించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీత రెడ్డి మాట్లాడుతూ, దళిత బంధులో వాసాలమర్రి రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని, లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. వాసాలమర్రి గ్రామానికి మహర్దశ పట్టించిన గౌరవ సీఎం దార్శనికుడని అన్నారు. గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు ఏడు కోట్ల 60 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, లబ్ధిదారులకు వారికి ఇష్టమైన రంగాల్లో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. 76 దళిత కుటుంబాలకు సంబంధించి 57 కుటుంబాలకు గ్రౌండింగ్ చేయడం జరిగిందని, మిగతా వారికి కూడా అతి త్వరలో గ్రౌండింగ్ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. వాసాలమర్రి పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా, ఏఎన్.ఎం. సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, గ్రామస్తులు కూడా పారిశుద్ధ్యానికి సహకరిస్తున్నారని అన్నారు. మేము ఏదైనా చేయగలమనే ధైర్యం గ్రామస్తులలో కనిపిస్తున్నదని అన్నారు. గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు పూర్తి చేయడం జరుగుతుందని, వాసాలమర్రి ఒక మోడల్ విలేజ్ గా చేయడమే లక్ష్యమని అన్నారు. రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొదటి ప్రాముఖ్యత పారిశుద్ధ్యానికే ఇవ్వాలని, గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రెటరీ శ్రీమతి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి విప్లవాత్మకంగా దళిత బంధు ప్రకటించి, విజయవంతంగా కార్యాచరణ చేపట్టారని, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, వాసాలమర్రి గ్రామంలో దళిత బంధు పథకం విజయవంతంగా ముందుకు వెళుతుందని, రాబోయే రోజులలో దళిత బంధు లబ్ధిదారులు ఇతరులకు ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. దళిత బంధులో ప్రతి కుటుంబ వివరాలు నమోదు అయ్యాయని, ప్రతి శాఖ అధికారులు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. గ్రామ అభివృద్ధి అంటే ప్రతి ఒక్క కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సాధించడం జరుగుతుందని, మంచి ఫలితాలు వస్తాయని, అందరం కలిసి మోడల్ గ్రామంగా తీర్చిదిద్ది పూర్తి చేద్దామని అన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి శ్రీమతి ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ, దళిత బంధు ద్వారా అందరూ తమ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవాలని, తిరిగి వేరే వారికి ఉపాధి కల్పించాలని అన్నారు.
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ శ్రీమతి దివ్య మాట్లాడుతూ, కుటుంబం మంచిగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా తల్లీ పిల్లల ఆరోగ్యం బాగుండాలని, కెసిఆర్ కిట్ పథకం అద్భుతంగా పనిచేస్తున్నదని అన్నారు. చిన్న పిల్లలకు మొదటి 1000 రోజులు ముఖ్యమని, మెదడు మంచిగా పెరుగుతుందని, దానికి మంచి పోషకాహారం తీసుకోవాలని అన్నారు. గ్రామంలో మూడు అంగన్వాడీలు ఉన్నాయని, పిల్లలు సరైన వయస్సుకు తగిన బరువు, ఎత్తు ఉండాలని, గ్రామంలో 20 మంది పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని, వచ్చే మూడు నెలల్లో వారి పట్ల పూర్తి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ నెల నుండి ప్రతి శిశువుకు గ్రోత్ నమోదు కార్డు ఇస్తామని, ఆరు సంవత్సరాల వరకు వారి ఎదుగుదలను నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. శిశువులకు అందించే బాలామృతం లో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని, బాలామృతం తమ పిల్లలకు తల్లులు వాడాలని అన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్ మాట్లాడుతూ, వాసాలమర్రి గ్రామం దశ మారిందని, మహిళలు ముందుకు వచ్చి సాధికారికంగా మాట్లాడుతున్నారని అభినందించారు. ఇంత మంచి రైతు వేదిక భవనంలో గ్రామ సభ నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి సునంద, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భిక్యూ నాయక్, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, ఎంపీపీ శ్రీమతి భూక్యా సుశీల, గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల ప్రవీణ్ కుమార్, గ్రామ వార్డు సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
