మునిసిపల్ కార్యకలాపాలన్ని ఇకపై ఆన్ లైన్ ద్వారానే  జరగాలి

ప్రచురణార్ధం

మునిసిపల్ కార్యకలాపాలన్ని ఇకపై ఆన్ లైన్ ద్వారానే  జరగాలి ……

మహబూబాబాద్, 2021 డిసెంబర్-22:

మునిసిపల్ కార్యకలాపాలు ఇకపై  ఆన్ లైన్ ద్వారానే జరగాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో మునిసిపల్ అధికారులు, సిబ్బందితో మునిసిపల్ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. 

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ, మునిసిపల్ కు సంబంధించిన కార్యకలాపాలన్ని ఆన్ లైన్ ద్వారానే జరగాలని ఆదేశించారు. ఇకపై ధరఖాస్తులను ఆన్ లైన్ లోనే స్వీకరించాలని తెలిపారు.  మునిసిపాలిటీల వారీగా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షిస్తూ  నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో జరుగుతున్న లోపాలను గుర్తించి అధిగమించుటకు ప్రణాళికలు రూపొందించుకొని ప్రతి నెల లక్ష్యాలను నిర్ధేశించుకొని నిర్ణీత సమయంలో ప్రగతిని సాధించాలని అన్నారు. 

పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హరితహారం పనులను పరిశీలించాలని, పెంచుతున్న మొక్కలను ఒక పద్ధతి ప్రకారంగా, పట్టణా వాసులకు అందంగా కనబడేలా, భవిష్యత్తులో ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు అయ్యె విధంగా మొక్కల పెంపకం ఉండాలని, పనులు చేపట్టి పర్యవేక్షణ కొరవడితే అనుకున్న లక్ష్యాలను సాధించలేమని నిధులు కూడా వృధా అవుతాయని అన్నారు.  నిరంతరం పర్యవేక్షణ చేసి మొక్కలను సంరక్షించాలని కోరారు.

పట్టణాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షిస్తూ, పరిపాలన ఆమోదం లభించిన పనులు, ఇప్పటి వరకు పూర్థి చేసినవి, పూర్తి కావల్సిన పనులు, ఇంకనూ చేపట్టని పనుల వివరాలను మునిసిపాలిటీల వారీగా ఆడిగి తెలుసుకున్నారు. వైకుంఠ ధామాలను త్వరితగతిన పూర్తి చేయించాలని, మున్సిపల్ నిధులు అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలన్నారు. ప్రతి నెలా మున్సిపల్ కార్యకలాపాల లక్ష్యాలను సమీక్షించాలని అదనపు కలెక్టర్ కు సూచించారు.  జంక్షన్లు అభివృద్ధి పరచాలని, రంగులు వేసి అందంగా తీర్చి దిద్దాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ పై దృష్టి పెట్టాలని, ఐ.ఈ.సి.కార్యకలాపాలను ముమ్మరం చేయాలని, అందుకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

టి.ఎస్.బి.పాస్ పై దృష్టి పెట్టాలని, అనుమతులు లేకుండా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉండేందుకు నిరంతరం పర్యవేక్షణ అవసరమన్నారు. త్రాగు నీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా వేసవికాలం వరకు త్రాగునీటి కనెక్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ శాఖ నుండి ఎత్తైన మొక్కలు తెచ్చి నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మహబూబాబాద్ కమిషనర్ ప్రసన్న, మరిపెడ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, తొర్రుర్ కమిషనర్ గుండె బాబు, డోర్నకల్ కమిషనర్ , పట్టణ ప్రణాళిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post