మున్సిపాల్టీలలో అక్రమ కట్టడాలకు వత్తాసు పలికితే టిపిఓల ఉద్యోగం ఊడుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు

. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి మున్సిపల్ ఛైర్ పర్సన్స్, మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులతో పారిశుధ్య కార్యక్రమాలు, హరితహారం, బృహత్ పకృతి వనాలు, ట్రీ పార్కులు ఏర్పాటు, టిఎస్ బిపాస్, సమీకృత మార్కెట్లు, వైకుంఠదామాలు నిర్వహణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న స్థలంలో కాకుండా మరొక చోట అదే అనుమతితో భవనాలు నిర్మిస్తే అటువంటి నిర్మానాలను అక్రమ కట్టడాలుగా పరిగణించాలని చెప్పారు. మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మించిన భవనాలపై వారం రోజుల్లో నివేదికలు అందచేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అక్రమకట్టడాలపై కఠినంగా వ్యవహరించాలని ఉదాసీనంగా వ్యవహరిస్తే సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. భవన నిర్మాణాలపై టిపిఓలు నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. పట్టణాల అభివృద్ధిపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. డివైడర్లు ప్రక్కన పేరుకు పోయిన ఇసుకను తొలగించాలని, వాహనాలు జారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. బతుకమ్మ ఘాట్ల వద్ద విద్యుత్ ఏర్పాటుతో రక్షణ చర్యలు పాటించాలని చెప్పారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగింపుకు మణుగూరు మున్సిపాల్టీలో వినియోగిస్తున్న జటాయ్ కం సక్షన్ యంత్రం వినియోగంతో మురుగుకాలువల్లో ఇరుక్కుపోయిన వ్యర్థాలు తొలగించడానికి ఈ యంత్రం చాలా ఉపయోగ పడుతుందని, ఇతర మున్సిపాలిటీల్లో కొనుగోలు చేయాలని చెప్పారు. వ్యర్థాలు తొలగింపుకు యంత్రాలు వినియోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇంటింటి నుండి వెలువడే తడి వ్యర్థాలను వర్మి కంపోస్టు తయారు చేయుటకు వీలుగా వార్డుల్లో అక్కడక్కడ షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వ్యర్ధాలన్ని డంపింగ్ యార్డులకు తరలించడం వల్ల తడి, పొడి వ్యర్థాలు వేరు చేయడం ఇబ్బంది కరంతో పాటు  ఎక్కువ రోజులు పడుతుందని, అందువలన వార్డుల్లోనే వర్మి తయారు చేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. మొక్కలు సంరక్షణకు ప్రతి వార్డుకు బాధ్యులను నియమించాలని, మొక్కల సంరక్షణ 85 శాతం కంటే తక్కువ ఉండే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. పచ్చదనం పెంపొందించడానికి బృహాత్ పకృతి వనాలు, ట్రీ పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పారు. బృహత్ పకృతి వనాలు అడవిని తలపించు విధంగా ఉండాలని, తద్వారా పట్టణ ప్రజలకు చక్కటి ఆహ్లాదాన్ని అందించు విధంగా ఉండాలన్నారు. వివిధ రకాల ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. మున్సిపాల్టీలలో ఓపెన్ జిమ్  ఏర్పాటు చేయాలని చెప్పారు. పట్టణ ప్రజల ఆహ్లాదం కొరకు ఏర్పాటు చేయనున్న హరితవనాలు ద్వారా పట్టణాలు పచ్చదనాన్ని సంతరించుకోవాలని ఆయన సూచించారు. మొక్కల సంరక్షణకు వాచర్లను నియమించాలని చెప్పారు. పట్టణాల్లో మొక్కలు లేకుండా ఎక్కడా ఖాళీ స్థలాలు కనబడొద్దని ఆయన పేర్కొన్నారు. కొత్తగూడెం మున్సిపాల్టీకి కేటాయించిన లక్షాన్ని  ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని చెప్పారు. పట్టణాల్లో మార్పులు రావాలని, అది 10 కాలాలపాటు ప్రజల హృదయాల్లో నిలిచిపోయేదిగా ఉండాలని చెప్పారు. ట్రీ పార్కులు ఏర్పాటుపై ప్రతి శనివారం నివేదికలు అందచేయాలని చెప్పారు. రానున్న 15 రోజుల్లో మున్సిపాల్టీలను గ్రీన్, క్లీన్ మున్సిపాల్టీలుగా ప్రకటించు విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కెటిపిఎస్, కాలనీల నుండి వ్యర్థాలు సేకరణ చేపట్టాలని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ చైర్మన్లు సీతాలక్ష్మి, వెంకటేశ్వర్లు, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులు అర్జున్, ముత్యం, అలీం, పురందర్, మున్సిపల్ కమిషనర్లు సంపత్

కుమార్, శ్రీకాంత్, నాగప్రసాద్, అంజన్ కుమార్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ ఈఈ రంజిత్, డిఈ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post