DPRO ADB- ముల్తాని గ్రామాల సమస్యలను పరిష్కరిస్తాం -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

గుండాలతో సహా నాలుగు ముల్తాని గ్రామాల పిల్లల విద్యాభ్యాసంపై దృష్టి సారిస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గుండాల బాధిత కుటుంబికులు, గ్రామస్తులతో సమావేశమైనారు. గత నెల 27న గుండాల గ్రామంలో ఓకే కమ్యూనిటీకి చెందిన ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరి దారుణ హత్యలు, పలువురికి గాయాలు, బాధితుల ఇండ్లు, వాహనాలు ధ్వంసం చేస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు సకాలంలో రంగ ప్రవేశం చేసి భారీ ఆస్తి, ప్రాణం నష్టం కలగకుండా నివారించారు. ఘర్షణలు పునరావృతం కాకుండా నివారించే చర్యల్లో రెండు రోజులపాటు గుండాల గ్రామంలోనే క్యాంపు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గ్రామ ప్రజల స్థితిగతులను అవగతం చేసుకున్నారు. గుండాల, కేశవపట్నం, ఎల్లమ్మగూడ, జోగిపేట్ గ్రామాల్లో సుమారుగా 1500 మంది పైచిలుకు ముల్తానిల్లో ప్రధానంగా కొందరు అక్రమ మార్గంలో కలప రవాణా చేయడమే జీవనాధారంగా చేసుకున్నారు. అధిక శాతం పిల్లలు ప్రాథమిక విద్యాభ్యాసం కూడా పూర్తి చేయకుండా నిరక్షరాస్యులుగానే మిగలడం ప్రధాన సమస్యగా మారిందని ఎస్పీ గ్రహించడంతో శాశ్వత పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సహకారంతో అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుండాల గ్రామస్తులతో కలిసి సమస్యలను జిల్లా కలెక్టర్ కు స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో పిల్లలకు విద్యాభ్యాసం అందించడానికి కృషి చేస్తామన్నారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి బడిలో చేర్చడానికి కృషి చేస్తామన్నారు. గ్రామస్తులను వ్యవసాయం వైపు మళ్ళించి అవసరమైనవారికి సహాయం అందించడానికి ప్రయత్నిస్తామన్నారు. త్వరలోనే ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలపై సిద్ధం చేసిన నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు వేగంగా చేపడతామని తెలిపారు. ముల్తాని కుటుంబాల జీవన విధానంలో మార్పునకు కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు వారి సమస్యలను తనకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం, విద్యాపరంగా పరిజ్ఞానం చెందడంతోనే ప్రశాంతమైన జీవనం సాగించే అవకాశం ఉందన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు ముల్తానీ కుటుంబసభ్యుల్లో ఒక్కరిగా వారితో కలిసి గుండాల గ్రామంలోనే ఉండడంతో ప్రజలు పూర్తి సహకారం పోలీసులకు అందించారని తెలిపారు. ఘర్షణలు అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని ప్రజలకు కోరిన మేరకు సహకారం అందించారని వివరించారు. కేవలం నిరక్షరాస్యత వల్ల ఆలోచన పరంగా అభివృద్ధి చెందడం లేదని తెలిపారు. గ్రామస్తులను వ్యవసాయం వైపు మళ్లించి జీవనోపాధి మార్గాలు చూపించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇచ్చోడ ఎంపీడీవో రాంప్రసాద్, తాసిల్దార్ అతికుద్దిన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జే. కృష్ణ మూర్తి, ఎస్ఐ సయ్యద్ అన్వర్ ఉల్ హక్, ఇచ్చోడ ఏఎస్ఐ లింబాజి జాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై బి. సురేందర్, ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత తదితరులు పాల్గొన్నారు.

Share This Post