*ప్రచురణార్థం-2*
*మెరుగైన వైద్య సేవలు అందించాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*
జయశంకర్ భూపాలపల్లి, మే 5: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో వైద్య, ఆరోగ్య శాఖ కు సంబంధించి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యాధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ, సత్వర సేవలకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో గర్భిణుల నమోదు వంద శాతం చేయాలన్నారు. నమోదయిన గర్భిణీ, రెండో, మూడో, నాలుగోసారి పరీక్షలకు వచ్చేలా పర్యవేక్షణ చేయాలన్నారు. చిన్న పిల్లలకు టీకాలు వంద శాతం చేయాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. డెంగ్యూ, టిబి, మలేరియా, కుష్ఠు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అట్టి వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేపట్టి, నిర్ణీత కోర్స్ ప్రకారం మందులు అందించాలని ఆయన అన్నారు.
డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చిన ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి, వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇమ్యునైజేషన్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఏఎన్సి పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వంద శాతం జరగాలని, ప్రసవం వరకు కేసులను పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో కనీస మౌళిక వసతుల కల్పనకు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. మెరుగైన సేవలు అందించి, ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలన్నారు.
ఈ సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. శ్రీరాం, ఉప జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. కొమురయ్య, ప్రోగ్రాం అధికారులు రవికుమార్, గోపీనాథ్, ఉమాదేవి, శ్రీదేవి, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.