పత్రిక ప్రకటన
తేదీ : 07–06–2022
మేడ్చల్ పట్టణం పచ్చదనంతో వెల్లివిరియాలి ..
మేడ్చల్ పట్టణంలో పలువార్డులను సందర్శించిన కలెక్టర్ హరీశ్
పట్టణ ప్రగతి విజయవంతమయ్యేలా అందరూ కృషి చేయాలి
మేడ్చల్ పట్టణాన్ని పచ్చదనంతో వెల్లివిరిసేలా మొక్కలను పెంచాలని అందుకు అవసరమైన పూలమొక్కలను నర్సరీల నుంచి తీసుకురావాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, మున్సిపల్ ఛైర్పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి మేడ్చల్ పట్టణంలోని పలు వార్డులను కలెక్టర్ హరీశ్ సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలో 17వ వార్డులోని వీధుల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అక్కడే ఉన్న మహిళలను వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వార్డులో ఉన్న చెత్త వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం 20వ వార్డులో చెట్లు, డివైడర్లకు రంగులు వేయడాన్ని పరిశీలించారు. చెట్లు, డివైడర్లకు అందంగా కనిపించేలా రంగులు వేయాలని తెలిపారు. అలాగే మురికి కాలువలను పరిశీలించి ఎప్పటికప్పుడు మురికి కాలువల్లో చెత్తను తొలగించాలని… తొలగించిన చెత్తను రోడ్డ్డుకు పక్కన వేయకుండా ట్రాక్టర్లు, వాహనాల్లో తరలించాలని అన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణంలో నిర్మించనున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ స్థలాన్ని కలెక్టర్ హరీశ్ సందర్శించారు. పనులను త్వరితగతిన ప్రారంభించాలని… ఇప్పటికే ఆలస్యమైనందున వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. పట్టణంలోని నాలుగో వార్డులో అవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. 15వ వార్డులో ఉన్న వైకుంఠధామాన్ని పరిశీలించిన కలెక్టర్ మొక్కలు పెంచాలని… పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అలాగే అక్కడ బాంబో చెట్లను పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జాతీయ రహదారిపై పచ్చదనం (గ్రీనరీ) పెంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం రోడ్డుకు ఇరువైపులా పూలమొక్కలను నాటాలని… పచ్చదనంతో నిండిపోయేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మేడ్చల్ పట్టణంలో ప్రతి దుకాణం ముందు సంబంధిత దుకాణ యజమానులు తప్పకుండా మొక్కలను నాటాలని… నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. అనంతరం అత్వెల్లిలోని నర్సరీకి వెళ్ళిన కలెక్టర్ హరీశ్ నర్సరీని పరిశీలించారు. ఈ నర్సరీలో ఏఏ మొక్కలు పెంచుతున్నారు… ఇంకా ఎలాంటి మొక్కలు అవసరమనే వివరాలను తెలుసుకొన్నారు. నర్సరీలో తప్పకుండా రిజిష్టర్ మెయింటెన్ చేయాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా నర్సరీలో చేపట్టాల్సిన పలు పనులకు సంబంధించి సలహాలు, సూచనలను కలెక్టర్ అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, మున్సిపల్ ఛైర్పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.