మే 6వ. తేది నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియేట్ పరీక్షల ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.    తేది:25.04.2022, వనపర్తి.

మే 6వ. తేది నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
సోమవారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 6వ తేది నుండి 24వ. తేది వరకు, ఉదయం గం.9.00 ల నుండి మధ్యాహ్నం గం.12.00 ల వరకు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో మొదటి సంవత్సరం 6,217 మంది విద్యార్థులు, అదే విధంగా రెండో సంవత్సరం 6,415 మంది, మొత్తం 12,632 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందుకుగాను జిల్లాలో 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విద్య, వైద్య, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్.టి.సి. పోస్టల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె అన్నారు.
పరీక్షలు సాఫీగా నిర్వహించుటకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను, 10 ప్రశ్నాపత్రాలను భద్రపరిచే కేంద్రాలను (పోలీస్ స్టేషన్) ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె సూచించారు. ప్రశ్నపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించుటకు సెక్యూరిటీని, అవసరమైన పొలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయవలసినదిగా పోలీస్  అధికారులకు ఆమె సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు, సమీప జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా రెవిన్యూ అధికారులను కోరారు. పరీక్షలకు సాఫీగా నిర్వహించుటకు అవసరమైన సిబ్బందిని, ఇన్విజిలేటర్లుగా కేటాయించవలసినదిగా విద్యాశాఖ అధికారికి, వేసవి కాలం దృష్ట్యా ప్రతి పరీక్ష కేంద్రము వద్ద ప్రాథమిక చికిత్స అందించుటకు అవసరమైన మందులు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, ఎ.ఎన్.ఎం. లను ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి, విద్యుత్ లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడవలసినదిగా విద్యుత్ శాఖ అధికారులకు ఆమె సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాలకు బస్సులను ఆలస్యం ఉదయం గం. 8.00 ల లోపు విద్యార్థులు చేరే విధంగా చూడాలని ఆర్.టి.సి. అధికారులకు ఆమె సూచించారు. స్పీడ్ పోస్ట్ అందుబాటులో వుండే విధంగా చూడాలని పోస్టల్ శాఖను ఆమె ఆదేశించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు చేపట్టాలని, సి.సి. కెమెరాలకు ఏర్పాటు చేయాలని, ఒక్క నిమిషం ఆలస్యంగా అయినా అనుమతించరాదని ఆమె తెలిపారు. హాల్ టికెట్లను ఆన్ లైన్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) వేణుగోపాల్, ఇంటర్మీడియెట్ విద్యా శాఖ అధికారి కె.ప్రకాశం శెట్టి, జాకీర్, విద్యా శాఖ, వైద్య శాఖ, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్.టి.సి, పోస్టల్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post