*మే 7 నాటికి హరితహారం కార్యాచరణను రూపొందించాలి:: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్*

*ప్రచురణార్థం-1*

*మే 7 నాటికి హరితహారం కార్యాచరణను రూపొందించాలి:: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్*

*19.54 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో 8వ విడత హరితహారం*

*అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు*

*అటవీ పునరుద్ధరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి*

*7 రోజుల్లో దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి*

*వరి కోతలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం*

*ప్రతి రైతు వేదిక కేంద్రం గా వారానికి 2 రైతు శిక్షణా కార్యక్రమాలు*

*హరితహారం, దళిత బంధు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్*

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 29: జిల్లాల్లో మే 7 లోగా 8వ విడత హరితహారం కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరితహారం, దళిత బందు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయం తదితర అంశాలపై శుక్రవారం సిఎస్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హరితహారం కార్యక్రమం నిర్వహణ పై ప్రతి జిల్లా తమ పరిధిలో ప్రణాళిక రూపొందించుకోవాలని, ఈ అంశంపై ప్రతి వారం కలెక్టర్ సమీక్ష నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న నర్సరీలు, జరుగుతున్న ప్లాంటేషన్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సిఎస్ ఆదేశించారు. డివిజనల్ అటవీ అధికారులను హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని, వారు మరింత చురుకైన పాత్ర పోషించే దిశగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.

జిల్లాలో హరిత హారం కింద నాటిన మొక్కల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతివారం కనీసం 3 సార్లు మొక్కలకు వాటరింగ్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాల్లో పెద్ద ఎత్తున మొక్కలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేయాలని ఆయన ఆదేశించారు.

జిల్లాలోని ప్రతి మండలంలో 5 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించామని, 8వ విడత హరితహారం లో లో మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలని అన్నారు. జిల్లాలో మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 141 అర్బన్ లోకల్ బాడీలో 1002 నర్సరీలు ఉన్నాయని, నకిరేకల్ అలంపూర్ మున్సిపాలిటీలలో నర్సరీలు పెంచుకోవాలని, పరకాల, బాన్సువాడ, హుస్నాబాద్, దుబ్బాక మొదలైన మున్సిపాలిటీలలో పట్టణ ప్రకృతి వనరుల సంఖ్య పెంచాలని ఆయన సూచించారు.

కరీంనగర్, హైదరాబాద్, నారాయణపేట, సూర్యాపేట్ వనపర్తి, సంగారెడ్డి, వరంగల్ గద్వాల్, హనుమకొండ జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో అటవీప్రాంతం ఉందని, వచ్చే సంవత్సరం అటవీ విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్ ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు.
7 రోజుల్లో కలెక్టర్లకు బదిలీ చేసిన నిధులను వినియోగిస్తూ పూర్తిస్థాయిలో దళిత బంధు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని సిఎస్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. రైతు వేదికలను సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకొని రావాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన గణాంకాల లో తెలంగాణ ప్రాంతంలో 6.88% గ్రీన్ కవర్ పెరిగిందని, దీనికి కృషి చేసిన అధికారులు ప్రభుత్వ సిబ్బంది ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 8వ విడత హరితహారం కార్యక్రమం కింద 19.45 కోట్ల మొక్కలు నాటాలని, దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు.

అవెన్యూ ప్లాంటేషన్ లో నాటే ఎత్తైన మొక్కలను నర్సరీ లోనే తయారు చేయాలని ఆమె సూచించారు. జిల్లాలో అటవీ పునరుద్ధరణ కోసం చేపట్టే చర్యలు, పనుల ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. అటవీ భూముల్లో బ్లాక్ ల వారీగా మొక్కలు నాటే వాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని, అటవీ అధికారులను ప్రత్యేకంగా బ్లాకులకు నియమించాలని సూచించారు.

పంచాయతీ కార్యదర్శులు చురుగ్గా ఉన్న గ్రామాల్లో గ్రీన్ కవర్ బాగా పెరిగిందని, 10% గ్రీన్ బడ్జెట్ వినియోగంపై కలెక్టర్ రివ్యూ చేపట్టాలని ఆమె సూచించారు. జిల్లాలో ఉన్న అటవీ అధికారులు క్షేత్ర స్థాయిలో నర్సరీలు సందర్శించి వారికి సూచనలు చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీలు , పట్టణాలలో లేఅవుట్ ఓపెన్ ప్లేస్ లో రైతన్న మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేయాలని ఆమె ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ ద్వారా రెండు సంవత్సరాలలో 10960 ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్, 46303 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ కింద పదికోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లా కలెక్టర్లకు నిధులు మంజూరు చేశామని, యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. భూపాలపల్లి , ములుగు , నాగర్ కర్నూల్ జిల్లాలో లో దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ లో వేగం పెంచాలని ఆయన సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, వరి కోత లకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, నాణ్యమైన ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడుతూ, వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా రైతు వేదికలో అందుబాటులో ఉండాలని తెలిపారు. వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగు, పచ్చి ఎరువుల వినియోగం, ఎరువుల మోతాదు తగ్గింపు, పత్తి కందుల సాగు పెంపు వంటి పలు అంశాల పై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రతి రైతు వేదికలో అవగాహన కార్యక్రమాల షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని అన్నారు. దళిత బంధు పథకం కింద వ్యవసాయ శాఖ పరిధిలో ఏర్పాటు చేసే యూనిట్ల ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ప్రతి రైతు వేదికలో ప్రతీ వారం కనీసం రెండు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, అటవీశాఖ అధికారి లావణ్య త్రిపాఠి,జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత ,డి ఆర్ డి ఓ పి డి పురుషోత్తం, డిపిఓ ఆశాలత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post