మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల అమలు పూర్తి స్థాయిలో జరగాలి జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది

మైనారిటీల సంక్షేమం కోసం ఉద్దేశించిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సూచించారు. సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్న వారిలో అత్యధికులు ముస్లిం మైనారిటీలే ఉన్నందున వారి అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన గురుతర బాధ్యత మన అందరిపై ఉందన్నారు. బుధవారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన ఆమెకు ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, అదనపు డీ సీ పీ అరవింద్ బాబు తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం అమలు తీరుపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మైనారిటీల స్థితిగతులు, వారి జనాభా గురించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరుస్తున్న లబ్ది గురించి కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముందుగా వివరించారు. ఐ సీ డీ ఎస్, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, మహిళా శిశు సంక్షేమం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, బ్యాంకింగ్, పోలీస్, రెవిన్యూ తదితర శాఖల ద్వారా మైనారిటీలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటి ప్రగతి గురించి కమిషన్ సభ్యురాలి దృష్టికి తెచ్చారు. కోవిడ్ కారణంగా గడిచిన రెండు సంవత్సరాల నుండి ఒకింత నెమ్మదించిన కార్యక్రమాలను ప్రస్తుతం వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యురాలు షాహేజాది మాట్లాడుతూ, షాదీ ముబారక్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్హులైన వారికి మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణ కోసం ఎక్కువ మందిని ఎంపిక చేస్తూ నాణ్యమైన శిక్షణ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మికుల కోసం ఉద్దేశించిన ఎన్ సి ఎల్ బి పాఠశాలలను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని సూచించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అందిస్తున్న ముందస్తు ఉచిత శిక్షణ కేంద్రాల్లో మైనారిటీ యువతులు ఎక్కువ సంఖ్యలో చేరేలా ప్రోత్సహించాలని, వారి కుటుంబీకులకు అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే మసీదు నిర్వహణ కమిటీల సహకారం తీసుకోవాలని సూచించారు. మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్య, ఉపాధి రంగాలకు సంబంధించి మైనారిటీలకు విరివిగా రుణాలు అందజేయాలని అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్ధిక తోడ్పాటును అందిస్తున్నందున, అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉపకార వేతనాల గురించి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై విద్యార్థులు, వారి తల్లితండ్రులకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మైనారిటీల కోసం ఉద్దేశించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నూటికి నూరు శాతం అమలయ్యేలా చూడాలన్నారు. ఆయా శాఖల అధికారులు అంకితభావంతో, సమర్ధవంతంగా పని చేస్తే ఎంతో మంది జీవితాలలో మార్పు వస్తుందని, ప్రభుత్వాల లక్ష్యం కూడా నెరవేరుతుందని హితవు పలికారు. సమాజానికి మేలు చేకూర్చే పదవులలో ఉన్న వారు సేవా దృక్పధంతో విధులు నిర్వర్తిస్తే ఎంతో సంతృప్తి లభిస్తుందని అన్నారు. తాను మళ్లీ సమీక్ష జరుపుతానని, ఆ సమయానికి మైనారిటీల సంక్షేమ కార్యక్రమాల అమలులో వంద శాతం లక్ష్య సాధన కనిపించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నాగోరావ్, విజిలెన్సు అధికారి షేక్ అహ్మద్ జియా, బషీర్, జెడ్పి సీఈఓ గోవింద్, డీపీవో జయసుధ, నిజామాబాద్ ఆర్డీఓ రవి, వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
———————–

Share This Post