మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం
ఎల్లారెడ్డిపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్.
మండల పంచాయతీ అధికారి, ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి, సాంకేతిక సహాయకులకు షోకాజు నోటీసులు జారీ.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో విఫలమైన అధికారులపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దె చెరువు ట్యాంకు బండుపై నాటిన నాలుగు వరుసల మొక్కల్లో చాలావరకు నీళ్లు అందించని కారణంగా ఎండిపోవడం, ప్రధాన రహదారి పక్కల నాటిన మొక్కల సంరక్షణ కూడా సరిగా లేకుండా ట్రీగార్డులు, సపోర్టు కర్రలు పడిపోవడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ సంబంధిత సిబ్బందిపై తీవ్ర చర్యలకు పూనుకున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతిరోజూ పర్యవేక్షణ జరుపుతూ వాచ్ అండ్ వార్డుల పనితీరును పర్యవేక్షిస్తూ మొక్కల రక్షణకు బాధ్యత వహించాల్సిన పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ తన బాధ్యతల నిర్వహణలో వైఫల్యం చెందడంతో ఆయనను కలెక్టర్ విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే ఈ పనులపై పర్యవేక్షణ జరపాల్సిన సాంకేతిక సహాయకుడు ప్రభాకర్, ఏపీఓ కొమురయ్య, మండల పంచాయతీ అధికారి వజీర్లకు షోకాజు నోటీసులు జారీ చేశారు.
హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. రానున్న వేసవి దృష్టిలో ఉంచుకుని మొక్కల సంరక్షణకు మండల పంచాయతీ అధికారులు, ఎంపీడీఓ లు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు