యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ ఉండదని, అందువలన రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ రైతులకు సూచించారు

. సోమవారం అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం, చంద్రుగొండ మండలం తుంగారం గ్రామాల్లో వ్యవసాయ, ఉద్యానశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యామ్నాయ పంటల సాగు రైతు అవగాహన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ రైతులనుద్దేశించి మాట్లాడుతూ యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలుందవని, ప్రత్యామ్నాయంగా పప్పు పంటలు, ఉద్యాన పంటలు సాగుచేపట్టాలని ఆయన పేర్కొన్నారు. రైతులు వరి వేస్తే అది వారి రిస్కేనని, వారు సొంత వినియోగం కోసం కానీ విత్తన కంపెనీల ఒప్పందంతో కానీ సాగు చేస్తే ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం లేదని దానికి పూర్తి బాధ్యత సాగు చేసిన రైతులేనని ఆయన స్పష్టం చేశారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేందుకు రైతు వేదికలతో పాటు గ్రామ గ్రామ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించి ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో రైతులను కూడా పెద్దసంఖ్యలో భాగస్వాములను చేయాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు. యాసంగిలో చేపట్టనున్న పంటల సాగుకు సంబంధించి వ్యవసాయ అధికారులు పంటల కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. భారత ఆహార సంస్థ వేసవిలో పండిన దాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పినందున యాసంగి దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని ఆయన వివరించారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, మండల వ్యవసాయ అధికారులు, తహసిల్దారులు బద్రకాళి, ఉపాశారద తదితరులు పాల్గొన్నారు.. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం ద్వారా జారీ చేయబడినది.

 

Share This Post