యాసంగిలో పండిన ధాన్యం కొనుగోలు చేయమని భారత ఆహార సంస్థ తెలిపినందున యాసంగిలో వరి పంటకు బదులుగా రైతులు ఇతర పంటల సాగు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో వ్యవసాయ, ఉద్యాన శాఖ  ఆధ్వర్యంలో  యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు  యాజమాన్య పద్ధతులు,  ఆయిల్ ఫామ్, కూరగాయలు, మల్బరీ వంటి ఉద్యాన పంటల సాగు వాల్ పోస్టర్లు,  కర పత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  భారత ఆహార సంస్థ  యాసంగిలో పండిన ధాన్యం కొనుచేయనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఉండదని,  అందువల్ల రైతులు వరి పండించి ఇబ్బంది పడకుండా ఉండాలనే ద్యేయంతో ముందునుండే  యాసంగిలో వరికి బదులుగా

ప్రత్యామ్నాయ పంటలు సాగుపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను సన్నద్ధం  చేయాలని చెప్పారు.  యాసంగిలో దాన్యంనకు బదులుగా   ప్రత్యామ్నాయ పంటలైన  అపరాలు (పప్పు గింజలు), నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, ఆయియ్ పామ్ వంటి  పంటలు సాగు చేపట్టాలని ఆయన రైతులకు సూచించారు.  పంటల మార్పిడినే   పంట వైవిధ్యీకరణ అంటారని,  పంటల వైవిధ్యీకరణ అంటే ప్రస్తుతం పాటిస్తున్న పంటల సరళిలో అధిక పోషక విలువలు, అధిక దిగుబడి, నేల సారాన్ని పెంపొందించే పంటలు సాగు చేయడం వల్ల పంటల సరళిలో ఉత్తమమైన మార్పులు రావడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అవకాశం ఉంటుందని చెప్పారు.  ఈ మేరకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై  అవగాహన కల్పించేందుకు ఆవాసాల వారీగా అవగాహన,  శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించారు.  ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం మరియు ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రైతులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా  ప్రదర్శించేందుకు గోడపత్రికలు, కరపత్రాలు అంటించాలని చెప్పారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగులో యాజమాన్య పద్ధతులు వివరించే కరదీపిక ప్రతి రైతుకు అందచేయాలని, ఇట్టి సమాచారం రైతులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ప్రతి ఆవాస ప్రాంతాల్లో రైతులకు ఈ ముద్రించిన సమాచారాన్ని అందించి వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, ప్రత్యామ్నాయ  పంటల సాగు లాభదాయకమనే సమాచారం చేరడం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇట్టి సమాచారం ప్రతి రైతు తెలుసుకోవాలని  కలెక్టరు రైతులకు సూచించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఉండదని, ఎవరైనా రైతులు వరి పండిస్తే వారి సొంత అవసరాలకు కానీ విత్తనాల కొరకు కానీ వినియోగించుకోవడం వారి సొంత రిస్క్ మీదనే ఆధార పడి ఉంటుందని, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేసారు.

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని రైతు వేదికలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో రైతులను పెద్ద ఎత్తున  భాగస్వాములను చేయాలని ఆయన వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం, చంద్రగొండ మండలం తుంగారం గ్రామాల్లో యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొని ప్రత్యాన్మయ పంటల సాగుపై రైతులకు వివరించారు.  వ్యవసాయ క్లస్టర్ వారిగా యాసంగి పంటల కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని వ్యవసాయ, ఉద్యాన  అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, ఏడీఏ రవి కుమార్ అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post