యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

యాసంగి పంటలో వరి, మొక్కజొన్న పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వ్యవసాయ అధికారులకు సూచించారు. సోమవారం రోజున కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులు, కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులతో యాసంగి పంటలపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, యాసంగి లో రైతులు పండించే వరి, మొక్కజొన్న పంటలకు బదులు ఇతర లాభదాయకమైన పంటలను సాగు చేసే విధంగా అవగాహన కల్పించి ప్రోత్సహించాలని అన్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించారని, భారత ఆహార సంస్థ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం లేదని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. ఈ దశలో జిల్లాలో ఉట్నూర్ ప్రాంతంలో సుమారు 400 ఎకరాలలో వరి సాగు చేయడం జరుగుతుందని, అట్టి వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలను భూ సారాన్ని బట్టి రైతులకు వివరించాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధం గా ఉంచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27 నుండి 29 వరకు యాసంగి పంటలపై రైతులకు శిక్షణ కార్యక్రమాలను రైతు వేడుకలలో నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని 101 క్లస్టర్ పరిధి లలోని రైతువేదికలలో శిక్షణ కార్యక్రమాలను వ్యవసాయ విస్తరణ అధికారుచే నిర్వహించాలని, వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. వచ్చే నెల నుండి వ్యవసాయ పంటలపై గ్రామాలవారీగా క్యాంపు లు నిర్వహించాలని అన్నారు. గ్రామాలలో రైతులతో సమావేశాలు జరిపి ప్రత్యామ్నాయ పంటలపై చర్చించి అవగాహన కల్పించాలని అన్నారు. అందుకు అవసరమైన షెడ్యూల్ ను తయారుచేయాలని అన్నారు. ఈ రోజు నుండి పత్తి కొనుగోళ్లు ప్రారంభం అయిన దృష్ట్యా రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వ్యవసాయం, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉద్యాన పంటలపై రైతులకు ప్రత్యేక్ష పద్దతిలో అవగాహన కల్పించి పంటల సాగుకు ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాకుమారి మాట్లాడుతూ, జిల్లాలో 1.25 లక్షల ఎకరాలలో యాసంగి పంటల సాగు జరుగుతుందని, ఇందులో అరవై శాతం శనగ, 25 శాతం జొన్న, మిగితా పంటలు సాగు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉద్యానవన అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కొన్ని మండలాల్లో ధనియా, మెంతి, జీలకర్ర వంటి పంటలను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. ఇట్టి పంటలను రైతులు స్వయంగా వారి ఇష్టమైన ప్రాంతాలలో అమ్ముకోవడం జరుగుతున్నదని తెలిపారు. ఇలాంటి రోజు వారి వినియోగ పంటలను సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ పుల్లయ్య, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. ప్రవీణ్ కుమార్, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post