యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

యాసంగిలో వరిధాన్యం సాగుపై కాకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోకళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభా సింగ్‌, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌ కుమార్‌తో కలిసి వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం యాసంగిలో వరికి బదులు ఇతర పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు సాగు చేసే విధంగా రైతులు సమాయత్తం చేయాలని, ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు రైతువేదిక స్థాయిలో, గ్రామ స్థాయిలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ విషయంపై పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం కూడా పెరుగుతుందని ఈ విషయం రైతులకు అర్థమయ్యే విధంగా తెలియజేయాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందని అన్నారు. ఈ జిల్లాలో లక్ష ఎకరాలలో యాసంగిలో వరి సాగుచేసే అవకాశం ఉందని, ఈ లక్ష్మ ఎకరాలలో బోర్ల కింద 62 వేల ఎకరాలు, చెరువుల కింద 11 వేల ఎకరాలు, కాలువల కింద 21 వేల ఎకరాలు, ఎత్తిపోతల పథకం క్రింద 8 వేల ఎకరాలు సాగు అయ్యే అవకాశం ఉందని, కేవలం దొద్దురకం వరిని పండించే అలవాటు ఉందని, ఎఫ్‌.సి.ఐ. వారు వచ్చే యాసంగిలో పండే వరి పంట దొడ్డు రకం కొనుగోలుకు నిరాకరించడం వలన రైతులు వరి పండించి నష్ట పోకుండా, ప్రత్యామ్నాయంగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న
పంట పండించే విధంగా దృష్టి సారించాలని తెలిపారు. ఈ విషయాన్ని రైతులు దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నామ పంటలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వరికి బదులుగా వేరుశెనగ, పొద్దుతిరుగుడు , నువ్వులు, పెసర, మినుములు, జొన్న జనుము, కూరగాయలు వంటివి సాగు చేయాలని, తెలిపారు. లక్ష ఎకరాల సాగులో పూర్తి స్థాయి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా రైతులు సన్నద్దం కావాలని, అలా కాకుండా కేవలం వరిధాన్యం దొడ్డురకం పంట సాగు చేసినట్లయితే సంబంధిత రైతులు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలపై కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్‌ నాయక్‌ వ్యవసాయ శాఖ సిబ్బందికి అవగాహన కల్పించారు. విత్తన లభ్యత, విత్తే సమయంపై క్షుప్తంగా వివరించారు.

ఈ సమావేశంలో కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్దినేటర్‌ రాజేశ్వర్‌ నాయక్‌, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు,
ఆయిల్‌ ఫామ్‌ సంస్ధ ప్రతినిధి ఉదయ్‌కూమార్‌, తెలంగాణ సీడ్స్ ప్రతినిధి భావన, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post