యాసంగిలో రైతులు వరికి బదులు ఇతర అరుతడి పంటలు సాగు చేసుకొనే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలి…. కలెక్టర్ నిఖిల.

యాసంగిలో రైతులు వరికి బదులు ఇతర అరుతడి పంటలు సాగు చేసుకొనే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలి…. కలెక్టర్ నిఖిల.

కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా వరి ధాన్యం కొనడంలేదని స్పష్టంగా చెప్పినందున, ఈ యాసంగితో పాటు ఇకముందు కూడా రైతులు వరికి బదులు ఇతర అరుతడి పంటలు సాగు చేసుకొనే విధంగా వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క రైతుకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు.

సోమవారం స్థానిక DPRC భావనంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వచ్చే యాసంగి నుండి వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, ఇకనుండి ఏ ఒక్క రైతు కూడా వరి పండించి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి క్లస్టర్ లోని ఒక్కొక్క రైతును కలసి వరికి బదులు ఇతర పంటలు సాగు చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ యాసంగికే కాకుండా ఇక నుండి వరి అస్సలు పండించవద్దని , ఇతర పంటలు వేసుకొని లాభాలు అర్జీంచే విధానాలను రైతులకు తెలియపర్చాలన్నారు. అవసరమైన ఇతర పంటల విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈసారి జిల్లాలో ఒక్క ఎకరం కూడా వరి పండించి రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. ప్రతి క్లస్టర్ లో వ్యవసాయ అధికారులు ఉదయం 9:00 గంటలకు అందుబాటులో ఉండి రాబోయే 15 రోజులు బాగా పని చేసి పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ప్రస్తుత వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి జనవరి 15 వరకు వరి ధాన్య సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సేకరించిన వరి ధాన్యానికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాకు వెంటనే జమ అయ్యేటట్లు చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇక నుండి క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post