యాసంగిలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా అవగాహన కల్పించాలి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని స్పష్టం చేసినందున, రాష్ట్రంలో వచ్చే యాసంగి సీజన్లో రైతులు వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

శనివారం ఆయన హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉన్నత అధికారులు, డీజీపీ మహేందర్ రెడ్డి తో కలసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోళ్ళ పురోగతి,యాసంగి పంటల సాగు, కో వి డ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతి పై సమీక్షించి, దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (FCI) ఇకముందు బాయిల్డ్ రైస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయమని స్పష్టం చేసిందన్నారు. రైతులకు ఇట్టి విషయమై అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపో రాదని, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు గ్రామ స్థాయి నుండి, రైతు వేదికలలో సమావేశాలు నిర్వహించి రైతులకు యాసంగిలో వరి సాగు చేయవద్దని, వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవలసిందిగా అవగాహన కల్పించాలని సూచించారు.

అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. బయట రాష్ట్రాల నుండి ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్ పి లకు సూచించారు. జిల్లాలో ఎస్పీ, జిల్లా కలెక్టర్లు రోజు 3/4 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లు లకు పంపాలని సూచించారు.

కరోనా న్యూ వేరియంట్ పలు దేశాల్లో ప్రబలుతున్నదని, రాష్ట్రంలో అన్ని విధాల జాగ్రత్తలు చేపడుతున్నామని, జిల్లాలో కోవిడ్ జాగ్రత్తలు విధిగా పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో 124 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో ఈసారి రెండు లక్షల యాభై వేల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. సరిహద్దు రాష్ట్రం నుండి ధాన్యం రాకుండా రెండు చెకపోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెవిన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో 24 గంటలు గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నార

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అడిషనల్ sp రషీద్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, drdo కృష్ణన్, పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, DM సివిల్ సప్లై అధికారి విమల, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post