యాసంగిలో రైతులు వరి ధాన్యం పండించకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లను సూచించారు

యాసంగిలో రైతులు వరి ధాన్యం పండించకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లను సూచించారు.  శనివారం మధ్యాహ్నం వరి ధాన్యం కొనుగోలు, యాసంగి లో సాగు పై డి.జి.పి మహేందర్ రెడ్డి ఇతర కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఎఫ్.సి.ఐ ద్వారా ఒక గ్రాము ఉప్పుడు బియ్యం సైతం కొనబోమని స్పష్టం చేసిందని, యాసంగిలో పండించే వరి ఉప్పుడు బియ్యం చేయుటకు మాత్రమే ఉపయోగపడుతున్నందున రైతులు ఎవరూ యాసంగిలో వరి పండించకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఒక వేళ రైతులు  తమ స్వంత   అవసరాలకు లేదా రైస్ మిల్లర్లతో మాట్లాడుకుని స్వంత ఇష్టముతో వరి పండించుకోవాలనుకుంటే అది వారి ఇష్టం అని తెలియజేయాల్సిందిగా సూచించారు.  ఈ విషయాలపై అన్ని రైతు కేంద్రాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు.  ఇందుకు సంబంధించిన ప్రచార సామాగ్రి సైతం అన్ని జిల్లాలకు పంపించడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా రేపటి నుండి వానాకాలం వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సూచించారు.  జిల్లాలో అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేసి రైతులకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా కొనుగోలు జరపాలని తెలియజేసారు.  దీనికొఱకు ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించే విధంగ చూసుకోవాల్సిన బాధ్యత అప్పగించాలన్నారు.  దినికి తోడు కలెక్టర్, అదనపు కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు వరి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ సమస్యలు లేకుండా చేసుకోవాలన్నారు.  రవాణా, అవసరమైన గోనె సంచులు, గోదాముల సమస్య లేకుండా సంబంధిత శాఖల ద్వారా సమన్వయం చేసుకోవలన్నారు.  ప్రతి కొనుగోలు కేంద్రంలో మౌళిక సదుపాయాలు ఉందేవిధంగా చూసుకోవాలని సూచించారు.  ప్రతిరోజు తెలికాన్ఫరెన్సు నిర్వహించి సమస్యలు లేకుండా చుసుకోవాలన్నారు.

ఇదే సమయంలో దళారులు  ఇతర రాష్ట్రంలో తక్కువ ధరకు వరి కొనుగోలు చేసి మన రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరకు అమ్మే ప్రమాదం ఉందని వీటిని అరికట్టడానికి పోలీస్ శాఖతో కలిసి కట్టడి చేయాలని సూచించారు.

డి.జి.పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో చాలా అప్రమత్తంగా ఉండి మధ్యవర్తుల ద్వారా వచ్చే ధాన్యాన్ని అరికట్టాలన్నారు.  ఇందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో దామరిగిద్ద మండలం తహసీల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ జిల్లాలో  104 కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు.  కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు పూర్తి చేస్తామని తెలిపారు. నారాయణపేట జిల్లా ఇతర రాష్ట్ర సరిహద్దులో ఉన్నందున జిల్లా పోలీసు శాఖతో కలిసి బయటి నుండి వరి ధాన్యం రాకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేవిధంగా అవగాహన కార్యక్రమాలు  చేపట్టడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ డా. చేతన, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post