యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలసాగు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ రైతులకు సూచించారు.

మంగళవారం పినపాక మండలం, ఊట్లపల్లి గ్రామంలో యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ యాసంగిలో పండే వరి పంటను భారత ఆహార సంస్థ కొనబోమని ఇదివరకే రాష్ట్రానికి చెప్పినట్లు చెప్పారు. పారా బాయిల్డ్ రైస్ తీసుకోమన్నారని, పైగా పంటల వైవిధ్యీకరణకు ప్రస్తుతం పాటిస్తున్న పంటల సరిళిలో అధిక పోషక విలువలు, అధిక దిగుబడులు, నేల సారాన్ని పెంపొందించే పంటలు చేరి ఆ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మన రాష్ట్రంలో పప్పుదినుసులు, నూనెగింజల అవసరానికి, ఉత్పత్తికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని, అందువలన యాసింగిలో వరికి బదులుగా ఇతర పంటలైన నూనెగింజలు, అపరాలు, కూరగాయల వంటి వైద్యమైన పంటలను సాగుచేయాలని రైతులకు సూచించారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు: రైతులకు ప్రభుత్వం రాయితీలు అందచేస్తుందని చెప్పారు. ప్రత్యామ్నయ పంటల సాగుపై అవగాహన కొరకు రైతులు అన్ని సమయాలలో వ్యవసాయ, ఉద్యాన అధికారులను సంప్రదించి సమస్యలను నివృత్తి చేసుకోవాలని చెప్పారు. వేసవిలో దాన్యం కొనుగోలు కేంద్రాలుండవని, ఎవరైనా రైతులు వరి సాగు చేస్తే అది వారి ఇష్టమేమని, ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేయదని చెప్పారు. సొంత అవసరాలు కొరకు కానీ, విత్తనాలు కొరకు కానీ వరి సాగు చేస్తే. అందుకు రైతులే బాధ్యులని ప్రభుత్వం ఎటువంటి బాధ్యత తీసుకోదని చెప్పారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై గ్రామ గ్రామాన, అన్ని మండలాలతో పాటు జిల్లాలోని అన్ని వ్యవసాయ క్లస్టర్లులోని రైతు వేదికల్లో రైతులను భాగస్వామలును చేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో రైతులతో ఇంటరాక్ట్ అవుతూ ప్రత్యామ్నయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నామని. రైతుల నుండి మంచి స్పందన వస్తునదని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో రైతులు పాల్గొని ప్రత్యామ్నయ పంటల సాగును చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. వానాకాలం, యాసంగిలో వరి తరువాత వరి పండించడం వల్ల పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటున్నదని పంటల మార్పిడి విధానం వల్ల భూ సంరక్షణ చర్యలతో పాటు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా ఈ యాసంగికి బరికి బదులగా ఇతర పంటల సాగు యాజమాన్య పద్ధతులు అనే కరపత్రాలను ప్రతి రైతుకు చేరే విధంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. అనంతరం కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాక్సిన్ తీసుకోవడం, తప్పనిసరిగా మాస్కులు ధరించడమే శ్రీరామరక్షని చెప్పారు. ఊట్లపల్లి గ్రామంలో 11 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సినవారున్నారని ప్రాధిమక సమాచారం ఉందని, వారు కూడా సత్వరమే వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ 11 మందికి కూడా వ్యాక్సిన్ తీసుకుంటే ఊట్లపల్లి వంటి మారుమూల గ్రామంలో నూరు శాతం వ్యాక్సిన్ జరిగిన గ్రామంగా ప్రకటిస్తామని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామం కూడా నూరు శాతం వ్యాక్సిన్ జరిగిన గ్రామంగా ప్రకటించాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మొదటి, డోసు రెండవ దోసులు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు, జిల్లా ఉద్యానవన అధికారి మరియన్లు, మండల వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post