యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు.

ఆదివారం కలెక్టర్ కార్యాలయ కోర్ట్ హాలులో వ్యవసాయ శాఖ అధికారులతో యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు పై కలెక్టర్ అమోయ్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ,భారత ఆహార సంస్థ (FCI) ఇకముందు వరి ధాన్యం కొనుగోలు చేయదని తెలిపినందున జిల్లాలో (2021-22) వచ్చే యాసంగి సీజన్లో రైతులు వరి సాగుకు బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా క్లస్టర్ల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.

యాసంగి సీజన్లో పండించే వరి పంటను కేంద్ర ప్రభుత్వం ,భారత ఆహార సంస్థ (FCI) కొనుగోలు చేయదని తెలిపినందున ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరగదని తెలుపుతూ వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులతో క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఏ డి లు, ఎఈ ఓలు, ఎమ్ ఈ ఓలను కలెక్టర్ ఆదేశించారు. వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న లాంటి పంటలు పండించాలని, రంగారెడ్డి జిల్లా రాష్ట్ర రాజధానికి సమీపాన ఉన్నందున కూరగాయలు, పువ్వులు సాగు చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ అన్నారు

ఈ సమావేశంలో అదనపు కలెక్టరులు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీత రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పిడి డి ఆర్ డి ఏ ప్రభాకర్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post