యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించలీ- అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి

సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ అనుబంధ అధికారులతో యాసంగి పంట సాగు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వరి ధాన్యం అవసరానికి మించి మిగులు ధాన్యం ఉన్నందున ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాసంగి వరి ధాన్యం కొనేందుకు సుముఖంగా లేదన్నారు. అందువల్ల రైతులు యాసంగిలో వరి ధాన్యం పండించి ఇబ్బందులు ఎదుర్కోకుండా రైతులకు ఇతర ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణాద్దికారులతో రైతు వేదికల్లో రైతులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. ఈ నెల 27 నుండి 29 వరకు ఏ.ఈ.ఓ లు తమ పరిధిలోని రైతులను రైతువేధికలకు పిలిపించుకుని సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం గ్రామాల్లో టామ్ టామ్ చేయించి రైతులకు సమావేశాలకు పిలిపించాల్సిందిగా సూచించారు. ఏ.డి.ఓ లు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన వన అధికారులు దగ్గరుండి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరికి బదులుగా యాసంగిలో ఆరుతడి పంటలైన నువ్వులు, రాగులు, పెసర్లు, మినుములు, అదే విధంగా కుసుమ, వేరుశెనగ వంటి నూనెగింజల పంటల సాగుపై అవగాహన కలగచేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల ద్వారా వచ్చే లాభాలు ఇంతకు ముందు పండించి లాభాలు పొందిన రైతులతో అవగాహన కల్పించాలన్నారు. మినుములు ఎంత పండించినా మంచి మద్దతు ధరతో మార్కెట్లో డిమాండ్ ఉంది అని విషయం అర్థమయ్యేలా చెప్పాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే పంటల పై రైతులకు అవగాహన కల్పించి అలాంటి పంటలను సాగు చేసేవిధంగా చూడాలన్నారు. గత యాసంగిలో జిల్లాలో దాదాపు 1.40 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యిందని ఈ సారి అలా జరుగకుండా గణనీయంగా పంట మార్పిడి జరిగే విధంగా ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి దీన్ని ఒక బాధ్యతగా, ఒక ఛాలెంజ్ గా స్వీకరించి రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటల సాగు వైపు మళ్లించాలని తెలియజేసారు. అదే విధంగా ఆరుతడి పంటల విత్తనాలు లభ్యత అందుబాటులో ఉండేటట్లు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, సంబందిత వ్యవసాయ పరిశోధన కేంద్రాల నుంచి అదే విధంగా వ్యవసాయ యూనివర్సిటీల నుంచి తెప్పించే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకోవాలని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటల సాగుకు మొగ్గు చూపే రైతులు ఇప్పటి నుండే తమ వివరాలు నమోదు చేసుకుంటే వచ్చే సంవత్సరం నుండి సబ్సిడీపై మొక్కలు తదితర సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు. కొర్రలు, రాగులు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను సైతం పండించేటట్లు చూడాలన్నారు. ప్రతి గ్రామంలో సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి సమాచారం రైతులకు చేరే విధంగా వ్యవసాయ శాఖ ప్రయత్నించాలని సూచించారు. ఉద్యాన వన అధికారులు రైతు కూరగాయల సాగు ద్వారా అధిక లాభాలు ఆర్జించ వచ్చని తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను తీసుకువచ్చే కూరగాయల పంటలు క్యారెట్ ,దొండ, క్యాప్సికం వంటి పంటలను పండించేటట్లు చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యాన పంటల పై సాగుకు అవగాహన కలిగించడానికి ఉద్యానశాఖ అధికారులు రైతులకు సలహాలు తెలియజేయలన్నారు. చౌడు నేలలు ఉన్న రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో సన్న రకం వరి పరిమిత మోతాదులో పండించుకోవచ్చన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు, వ్యవసాయ సహాయ సంచాలకులు, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, తది తరులు పాల్గొన్నారు.

Share This Post