యాసంగిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుమతి లేదని, డిమాండ్‌ను బట్టి రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం

డిశంబరు 23, ఖమ్మం

యాసంగిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుమతి లేదని, డిమాండ్‌ను బట్టి రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం వైరా మండలం గన్నవరం క్లస్టర్, ఖానాపురం రైతు వేదిక నందు యాసంగిలో వారికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం పంటకొనుగోలుకై జిల్లా వ్యాప్తంగా 250 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 1 లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 145 కోట్లు రైతుల ఖాతాలలో జమచేయడం జరిగిందన్నారు. వానాకాలంకు సంబందించిన పంటను పూర్తిగా కొనుగోలు చేస్తామని అయితే యాసంగిలో మాత్రం రైతులు ఒక ఎకరం కూడా వరి వేయవద్దని కలెక్టర్ సూచించారు. యాసంగిలో పండే వరి పంటను కొనుగోలు చేయమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, అందుకు గాను జిల్లా రైతులను ముందుగానే చైతన్యపర్చి వారికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు విస్తృతంగా అవగాహన కల్పించి అప్రమత్తం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ద్వారా రైతు అవగాహన కార్యక్రమాలను చేపడ్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు కూడా రైతుబంధు వర్తిస్తుందని ఇట్టి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. భూసారం, సాగునీటి వసతి ఆధారంగా డిమాండ్‌ను బట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, యాసంగిలో వరి వేసి రైతులు నష్టపోవద్దని కలెక్టర్ సూచించారు. రైతులు తమ స్వంత పూచికత్తున మిల్లులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే లేని యెడల విత్తనాల అవసరార్ధం తప్ప పరిసాగు చేయవద్దని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.

జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, ఏ.డి.ఏలు సరిత, బాబురావు, గ్రామ సర్పంచ్ వీరీ ఫర్హాద్, ఎం.పి.టి.సి. యనమల సౌజన్య, జడ్పీ.టి.సి కనకదుర్గ, రైతుబందు కన్వీనర్ శీలం శ్రీనివాసరెడ్డి, గన్నవరం సర్పంచ్ విజయలక్ష్మీ, తహశీల్దారు అరుణ, ఎం.పి.డి.ఓ వెంకటపతి రాజు, వ్యవసాయ విస్తరణాధికారులు. రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post