యాసంగిలో వరి పంట వేయకుండా రైతులకు అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి, మిల్లులకు త్వరగా ధాన్యాన్ని తరలించాలి రెండవ డోస్ కు అర్హులైన వారికి వ్యాక్సినేషన్ చేయాలి

ప్రచురణార్థం-1
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 7: రైతులు ఆరుతడి పంటలు పండించేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి, యాసంగిలో రైతులు వరి పంట వేయకుండా చైతన్యం తేవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. యాసంగిలో భారత ఆహార సంస్థ ధాన్యం కొనుగోలు చేసే అవకాశం లేదని, అధికారుల సూచనలు రైతులు పాటించి ఆరుతడి పంటలు సాగుచేయాలని రైతులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా వచ్చే లాభాల గురించి రైతులకు వ్యవసాయ అధికారులు ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని జాప్యం లేకుండా రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేట్లు చూడాలన్నారు. అనంతరం గ్రామంలోని గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. మొదటి డోస్ వేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే వారిని గుర్తించి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని, రెండవ డోస్ కు అర్హులైన వారికి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సిటీ స్కాన్ సెంటర్ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ నెలాఖరులోగా సిటీ స్కాన్ అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. తదనంతరం కలెక్టర్ వేములవాడ లోని షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న మౌళిక సదుపాయాల గురించి ఆరా తీశారు. వసతి గృహంలోని ఆర్వో ప్లాంట్ వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.

మున్సిపాలిటీల్లో వ్యాక్సినేషన్ కేంద్రాల తనిఖీ
వేములవాడ పట్టణంలోని నాగయ్యపల్లి, సిరిసిల్ల పట్టణం 26 వార్డు – సంజీవయ్య నగర్, 29 వార్డు – శివనగర్, 32 & 33 వార్డులు – బీవై నగర్ లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీ చేశారు. రెండవ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటివరకు అర్హులై కూడా వ్యాక్సిన్ వేసుకోని వారి వివరాలను సేకరించి, వ్యాక్సిన్ తీసుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సందర్శనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, ఎస్సీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్లు సమ్మయ్య, శ్యామ్ సుందర్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Share This Post