యాసంగిలో వరి సాగు వద్దు:: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బాయిల్డ్ రైస్ కోనుగోలు చేయమని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి లో వరి సాగు నివారణ ఉత్తమం రైతులు తమ సొంత పూచీకత్తు పై మాత్రమే వరి సాగు చేయాలి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి వానాకాలం పంట పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి ధాన్యం దళారులపై కఠినంగా వ్యవహరించాలి ధాన్యం కొనుగోలు, పంటల మా‌ర్పిడీ, కరోనా వ్యాక్సినేషన్, ధరణి వంటి అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 27: రాబోయే యాసంగి సీజన్ లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు, యాసంగి పంట ప్రణాళిక తదితర అంశాలపై శనివారం అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ కోనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి పంటతో బాయిల్డ్ రైస్ మాత్రమే తయారవుతుందని, కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థలు బాయిల్డ్ రైస్ కోనుగోలుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో వరి పంట సాగు శ్రేయస్కరం కాదని సీఎస్ అన్నారు. యాసంగి సీజన్ లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా రైతు వేదికల్లో వెంటనే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. రైతు యాసంగి సీజన్లో తన సొంత అవసరాలకు, విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం ఉంటే సొంత పూచికత్తుపై మాత్రమే వరి సాగు చేయాలని, ఈ సమాచారం వెంటనే క్షేత్ర స్థాయిలో రైతులకు తెలియజేయాలని సీఎస్ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యామ్నాయ పంటల సాగు పై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, అవసరమైన ప్రదేశాల్లో అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు ఆయన ఆదేశించారు. జిల్లాలో వీలైనంత త్వరగా వానాకాలం వరి కొనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. ప్రతి మండలానికి సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అవసరమైన స్థాయిలో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సీఎస్ ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న మిల్లింగ్ రైస్ లక్ష్యాలు పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట, మెదక్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో అధికంగా మిల్లింగ్ రైస్ పెండింగ్ ఉందని, వీరు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. మన రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల వద్ద దళారులు ఇతర రాష్ట్రాల ధాన్యం విక్రయిస్తున్నట్లు సమాచారం వస్తుందని, దీనిని పూర్తి స్థాయిలో నివారించాలని తెలిపారు. ధాన్యం దళారుల పై నిఘా ఏర్పాటు చేయాలని, చెక్ పోస్టులను అప్రమత్తం చేయాలని అన్నారు. రాష్ట్రంలోని 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. కరోనాతో మృతి చెందిన వారికి 50 వేల ఎక్స్ గ్రేషియా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు. ధరణి దరఖాస్తులు వంద శాతం పరిష్కరించాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, లక్షా 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 17 వేల 995 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు తెలిపారు. 6 వేల 356 మందికి 67 కోట్ల 56 లక్షల నగదు వారి వారి ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. ధాన్య కొనుగోలు ప్రక్రియ త్వరితగతిన పూర్తికి అన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, డీఆర్డీఓ కె. కౌటిల్య, డీసీఓ బుద్ధనాయుడు, డీఏఓ రణధీర్, డిటిఓ కొండల్ రావు, డీఎస్పీ చంద్రశేఖర్, సిరిసిల్ల పట్టణ సీఐ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post