యాసంగి లో పండించే వరిని భారత ఆహార సంస్థ(FCI) కొనుగోలు చేయడం లేనందున వరికి బదులు ప్రత్యమ్నాయ పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలి-జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

యాసంగి లో పండించే వరిని భారత ఆహార సంస్థ(FCI) కొనుగోలు చేయడం లేనందున వరికి బదులు ప్రత్యమ్నాయ పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు మరియు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రిగారి సూచనల మేరకు మండల వ్యవసాయ అధికారులు గ్రామాలలో పంటల సాగు పై పక్కా ప్రణాళికను తయారు చేసి, రైతులు యాసంగి సీజన్ లో వరి సాగుకు బదులుగా ప్రత్యమ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, ఆముదాలు ధనియాలు, కుసుమలు తదితర పంటలు పండించేలా, భూముల లక్షణాలకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. ఎఓలతొ, ఎఈఓలతో మండలాలు వారిగా పంటల సాగు పై సమీక్షించారు.
ప్రత్యమ్నాయ పంటలు పండించేందుకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి రైతులకు తెలియజేయాలని అన్నారు.
ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లాలో ఉన్న 83 రైతు వేదికలలో ఆ క్లస్టర్ వారిగా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించి 29న క్లస్టర్ల వారీగా యాసంగి పంట ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు.
గ్రామం లో ఉన్న రైతులందరు రైతు వేదిక సమావేశాలలో పాల్గొనేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.
అన్ని రైతు వేదికలలో నవంబర్ చివరి వరకు వారంలో కనీసం రెండు సార్లు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రతి సమావేశంలో 200 మంది రైతులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
మిగతా రోజులలో ఏఈవో వారి పరిధిలోని గ్రామాలను సందర్శించి రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.
ఎ.ఇ.ఓ లు రైతులకు అందుబాటులో ఉండి సాగులో వారికి తగిన సలహాలు, సూచనలు చేయాలనీ, విత్తనాల నాణ్యత పై, పంటలకు మార్కెట్ లో ఉండే ధరలు, వచ్చే లాభాల గురించి పూర్తి వివరాలు స్పష్టంగా రైతులకు చెప్పాలని, శాస్త్రవేత్తలతో సాగు పద్ధతులను వివరించాలని అన్నారు.
రాష్ట్ర రాజధానికి సమీపంలో రంగారెడ్డి జిల్లా ఉన్నందున కూరగాయలు, పండ్లు పండించేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ అధికారి ఆదేశించారు.
మండల , డివిజనల్ వ్యవసాయ అధికారులు వారి ఆధ్వర్యంలో ఉన్న రైతు వేదికలలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొని రైతులకు సూచనలు ఇవ్వాలని సూచించారు ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారిని నియమించారని, వారు కూడా మండల సమావేశాలలో పాల్గొని రైతులకు సూచనలు ఇవ్వాలని అన్నారు.

ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ తిరుపతి రావు, వ్యవసాయ శాఖ అధికారి గీత, ఉద్యానవన శాఖ అధికారి సునంద, క్రీడా శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ శేఖర్, సివిల్ సప్లై అధికారి మనోహర్ రాథోడ్, మార్కెటింగ్ శాఖ అధికారి శ్యామా దేవి, మండల ఎ.ఓ లు, ఎఈఓలు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post