యాసంగి లో వరి సాగు వద్దు….రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్

 

యాసంగి లో వరి సాగు వద్దు….రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్

బాయిల్డ్ రైస్ కోనుగోలు చేయమని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి లో వరి సాగు నివారణ ఉత్తమం
రైతులు తమ సోంత పూచీకత్తు పై మాత్రమే వరి సాగు చేయాలి

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని స్పష్టం చేసినందున,
రాష్ట్రంలో (2021-22) యాసంగి సీజన్లో రైతులు వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

శనివారం ఆయన హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోళ్ళ పురోగతి,యాసంగి పంటల సాగు, కో వి డ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతి పై సమీక్షించి, దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (FCI) ఇకముందు బాయిల్డ్ రైస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయమని స్పష్టం చేసిందన్నారు. రైతులకు ఇట్టి విషయమై అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపో రాదని, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు గ్రామ స్థాయి నుండి, రైతు వేదికలలో సమావేశాలు నిర్వహించి రైతులకు యాసంగి లో వరి సాగు చేయవద్దని, వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవలసిందిగా అవగాహన కల్పించాలని సూచించారు.

అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా , వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. బయట రాష్ట్రాల నుండి ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్ పి /సి.పి.లకు సూచించారు.
జిల్లాలో ఎస్పీ, జిల్లా కలెక్టర్లు రోజు 3/4 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లు లకు పంపాలని సూచించారు.

కరోనా న్యూ వేరియంట్ పలు దేశాల్లో ప్రబలుతున్నదని, రాష్ట్రంలో అన్ని విధాల జాగ్రత్తలు చేపడుతున్నామని, జిల్లాలో కోవిడ్ జాగ్రత్తలు విధిగా పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో 157 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని,13,782 మంది రైతుల నుండి రూ. 137.56. కోట్ల విలువగల 70184.320 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించామని సి.ఎస్. కు తెలిపారు.5413 మంది రైతుల ఖాతాలో రూ.62.09 కోట్లు జమ చేశామని తెలిపారు. ఇంకా 8369 మంది రైతులకు రూ.75.47 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయనున్నట్లు తెలిపారు.

జిల్లాలో గ్రామస్థాయిలో, రైతు వేదికలలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నామని, 2021-22 యాసంగి లో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రోత్సహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పి రమణ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు, సివిల్ సప్లైస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, డిఎం సివిల్ supplies సుగుణ భాయ్, డి సి ఓ తుమ్మ ప్రసాద్, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ గాయత్రీ దేవి, ఏపీడీ సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post