యాసంగి సిఎంఆర్ లక్ష్యం పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 26: యాసంగి 2020 – 21 సీజన్ కు సంబంధించిన సిఎంఆర్ ( కస్టం మిల్లింగ్ రైస్ ) సరఫరా లక్ష్యంను వెంటనే పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యాసంగి 2020-21 పంట కాలానికి సంబంధించి సిఎంఆర్ సరఫరాపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాసంగి సీజన్ 2020-21 సిఎంఆర్ బియ్యం సరఫరా లక్ష్యంలో ఇప్పటికి 2 లక్షల 29 వేల 222 మెట్రిక్ టన్నుల (47.35 శాతం) డెలివరీ పూర్తయినట్లు తెలిపారు మిగితా లక్ష్యం నవంబర్ 30 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ అదేశించారు. త్వరలోనే వానాకాలం ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున జిల్లాలోని 16 బాయిల్డ్, 26 రా రైస్ మిల్లులలో కూలీల సంఖ్యను పెంచి ప్రతి రోజు రెండు షిఫ్ట్ లలో పని జరగాలని అన్నారు. మిల్లర్లు, అధికారులు, తహసీల్దార్లు సమన్వయంతో ప్రతి రోజు పర్యవేక్షణ చేసి త్వరగతిన లక్ష్యం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, జిల్లా పౌరసరఫరాల అధికారిణి ఎం.రోజారాణి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా రైస్ మిల్లర్స్ ప్రతినిధి పెద్ది వెంకటనారాయణ గౌడ్, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post