యాసంగి సీజన్లో జిల్లా రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

అక్టోబరు, 25, ఖమ్మం:

యాసంగి సీజన్లో జిల్లా రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు ఉండదని ఎఫ్.సి.ఐ ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో వచ్చే యాసంగింలో రైతులను వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ జిల్లా స్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు, విత్తన విక్రయ డీలర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయాధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశము చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. యాసంగిలో కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే సాగవుతుందని, బాయిల్డ్ రైస్ ఎఫ్.సి.ఐ కొనుగోలు చేయదని తేల్చి చెప్పిందని ఈ సందేశం జిల్లా రైతులకు చేరవేసి భూసారానికి అనుకూలంగా వరికి ప్రత్యామ్నాయ పంటలకు మళ్లించాలని తదనుగుణంగా ఈ నెల 27 నుండి 29 వరకు ప్రతి రైతువేదికలో పెద్దఎత్తున రైతు అవగాహన సదస్సులు జరిపి రైతులను చైతన్యపర్చాలని వ్యవసాయాధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మండల వారీగా, ప్రాంతాల వారీగా భూసారానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో రైతులకు ఆదాయం లభించే ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం ఈ నెల 30 లోపు జిల్లా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. దీనిపై వ్యవసాయ విస్తరణాధికారులకు | ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించడం ద్వారా వ్యవసాయ విస్తరణాధికారులు క్లస్టర్ స్థాయిలో ప్రతిరోజు రైతుల చెంతకు వెల్లి పూర్తిగా అవగాహనపర్చి యాసంగిలో రైతులందరూ వారికి ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే విధంగా సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విత్తన డీలర్లు కూడా రైతులకు సరియైన దిశా నిర్దేశం చేయాలని దీనితో పాటు విత్తనాల కంపెనీలతో సంప్రదించి ప్రత్యామ్నాయ పంటలైన పెసలు, మినుమలు, నువ్వులు, ఆముదాలు, సన్ ఫ్లవర్, వేరుశనగ, బెంగాల్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ వంటి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని విత్తనాల డీలర్లకు కలెక్టర్ సూచించారు. యాసంగిలో వరి విత్తనాలను అమ్మె డీలర్లపై చర్యలుంటాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని తదనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించని విత్తన డీలర్ల షాపు లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూథన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీమతి విజయనిర్మల, కె.వి.కె శాస్త్రవేత్త హేమంత్ కుమార్, మధిర ఏ.ఎస్.ఆర్ శాస్త్రవేత్త, వ్యవసాయ శాఖ ఏ.డిఏలు, ఏ.ఓలు, విత్తన విక్రయ డీలర్లు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post