యుద్ధ ప్రాతిపదికన సామూహిక టీకా కార్యక్రమ ఏర్పాట్లు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 15: జిల్లాలో గురువారం నుండి చేపట్టే సామూహిక టీకా కార్యక్రమ ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, వైద్యాధికారులతో సామూహిక టీకా కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురువారం నుండి జిల్లాలోని 104 సబ్ సెంటర్ల హెడ్ క్వార్టర్స్ లలో సామూహిక టీకా కార్యక్రమ ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. సబ్ సెంటర్ల హెడ్ క్వార్టర్స్ లో కనీస మౌళిక వసతులు ఉన్న పాఠశాల, గ్రామ పంచాయతీ భవనాలు టీకా కేంద్రాలుగా గుర్తించాలని, అవసరమైతే రైతు వేదికలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఏ ఏ సబ్ సెంటరుకు ఎవరిని వ్యాక్సినేషన్ కు కేటాయించింది ముందస్తుగా తెలియపర్చి, వ్యాక్సిన్ తో సిబ్బంది టీకా కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 9 గంటలకు టీకా ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. టీకా కేంద్రాల వద్ద పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని, కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించాలని ఆయన అన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సిసి లతో ఇంటింటి సర్వే చేపట్టి, ప్రతి ఇంటిలో ఎంత మంది1 18 సంవత్సరాల పైబడిన వారు ఉన్నది, ఎంత మంది వ్యాక్సిన్ తీసుకున్నది వివరాలతో స్టిక్కర్లు అంటించాలన్నారు. టీకాకు, సర్వేకు సిబ్బందిని కేటాయించి, సిబ్బంది, ప్రత్యేక అధికారుల ఫోన్ నెంబర్లతో సహా బుధవారం రాత్రికి సమర్పించాలన్నారు. అధికారులు టీకా, సర్వే ప్రక్రియను పర్యవేక్షణ చేయాలన్నారు. సబ్ సెంటర్ల వారీగా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, పటిష్ట ప్రణాళికతో జిల్లాలో 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి టీకా ఇచ్చేలా సమర్థవంతంగా లక్ష్యం పూర్తి చేయాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post