యువతను దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి :: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి

యువతను దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి :: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 25: యువతను దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం జెన్కో గెస్ట్ హౌజ్ లో ఆస్పిరేషన్ జిల్లాల అభివృద్ధి కార్యక్రమ పురోగతిపై మంథని, ములుగు ఎమ్మెల్యేలు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో 112 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి, వాటి సమగ్ర అభివృద్ధికి ఆస్పిరేషన్ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. నీతి ఆయోగ్ ద్వారా, కార్పొరేట్ సంస్థల సహకారంతో అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని ఆయన తెలిపారు. అధికారులు వెనుకబడిన ప్రాంతాల ప్రజల ముందుకు వెళ్లాలని, వారిని చైతన్య పరచాలని ఆయన అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి ప్రజలు ఏం కోరుతున్నారు, మనం ఏం ఇస్తున్నాం అనే దానిపై ఆలోచన చేయాలన్నారు. ఉపాధికల్పనకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. టీమ్ వర్క్ గా పనిచేయాలని, పేద, వెనుకబడిన ప్రజలకు సేవచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా స్వీకరించి, కష్టపడి పనిచేయాలని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పన, పేద ప్రజలకు ఉపాధి అవకాశాలకల్పనకి అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గర్భిణీ నమోదయ్యేలా, ఏఎన్సీ చెకప్ లు వందశాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాక్సినేషన్ వంద శాతం చేయాలన్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. నైపుణ్య శిక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. భారత ప్రభుత్వం నుండి ఏ అవసరం ఉన్న తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు.
సమీక్షలో పాల్గొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, ఏఎన్సీ డాష్ బోర్డ్ ద్వారా ప్రతి ఏఎన్సీ చెకప్ ని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గర్భిణీ నమోదయ్యేలా క్షేత్ర స్థాయి నుండి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని సబ్ సెంటర్లను హెల్త్ వెల్ నెస్ సెంటర్లుగా చేసినట్లు ఆయన అన్నారు. జిల్లాలో చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు, రైతులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ అన్ని విభాగాల సంక్షేమ వసతి గృహల, కస్తూరిబా పాఠశాలల పిల్లలకు పోషక లోపం అధిగమించడానికి చిరు ధాన్యాల వంటకాలను అందించడానికి ప్రణాళిక చేసినట్లు ఆయన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 149, ములుగు జిల్లాలోని 126 పాఠశాలలను మొదటి విడత మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద ఎంపిక చేసి, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన అన్నారు. విడతల వారిగా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టుటకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నైపుణ్య శిక్షణకు ప్రత్యేక క్యాలెండర్ రూపకల్పన చేసినట్లు, ఇందులో 4200 మంది ఇప్పటికే నమోదయినట్లు, జాబ్ మేళాలు నిర్వహించి, శిక్షణ తో పాటు, ఉపాధికల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గిరివికాసం ద్వారా రైతులకు సాగుకు వసతులకల్పన చేస్తున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో రైతులు గత సంవత్సరం వేయి ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారని, ఈ సంవత్సరం 10 వేల ఎకరాల్లో సాగు లక్ష్యం గా కార్యాచరణ చెసినట్లు కలెక్టర్ తెలిపారు.

కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు అటవీ ప్రాంతాలని, పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. రామప్ప, కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయాలకు అనేకమంది భక్తులు వస్తారని, కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పధకంతో లబ్ది చేకూర్చాలన్నారు. ప్రతాపగిరి, రామగిరి ఖిల్లాలకు నిధులు కేటాయించి పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి పర్చాలన్నారు. కాటారం లో ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రధాన ఆసుపత్రి, అటవీ ప్రాంతం కావున ఆయుర్వేదిక్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్నారు. మహాదేవ్ పూర్ ప్రాంతాన్ని ఐటిడీఏ గా ప్రకటించాలని, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లాకు మొదటిసారి వచ్చిన కేంద్ర మంత్రిని ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.

ఈ సమీక్షా సమావేశంలో ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క), రెండు జిల్లాల అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, దివాకర టీఎస్, ములుగు డిఆర్వో రమాదేవి, రెండు జిల్లాల వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post