యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అందరి పై ఉంది-జిల్లా అదనపు కలెక్టర్ ప్రతి జైన్

యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అందరి పై ఉందని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతి జైన్ అన్నారు.
శనివారం జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ తన చాంబర్లో డిస్టిక్ అడ్వైజరీ కమిటీ యూత్ ప్రోగ్రామ్స్ పై నెహ్రుయువ కేంద్రం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో యువతను మంచి పౌరులుగా తీర్చి దిద్దేందుకు యూత్ క్లబ్ లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామస్థాయి నుండి వారిని అన్ని సేవ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయాలన్నారు. యువతను మాదకద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు బానిస కాకుండా దూరంగా ఉంచి సమాజసేవలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచిస్తూ అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. యువతకు శారీరక వ్యాయామం కొరకు ఆటలు, రన్నింగ్, జాగింగ్ 2k, 5k రన్ నిర్వహించాలని జిల్లా యువజన అధికారిని ఆదేశించారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొనే విపత్కర పరిస్థితులలో యువత ముందుండే విధంగా గ్రామస్థాయి నుండి యువకులను అన్ని సేవ కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలని అన్నారు. రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువై సేవ చేసే విధంగా యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. స్వచ్ఛతాహి సేవ 2021లో భాగంగా శ్రమ దాన కార్యక్రమం మొక్కలు నాటించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి ఐసయ్య, డీ ఆర్డీఏ పీ.డీ ప్రభాకర్, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేశ్వర్లు , జిల్లా సంక్షేమ అధికారి మోతి, రెడ్ క్రాస్ అధికారి నర్సింహారెడ్డి, జిల్లా వైద్య అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post