రక్త హీనత లోపం ఉన్నవారి ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రక్తహీనత లోపం ఉన్న వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

క్రమం తప్పకుండా పోషకాహారం అందించాలి

జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి

—————————————

రక్తహీనత లోపం ఉన్న గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి, వారికి సరైన పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.

శనివారం ఆయన తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని రెడ్డి సంఘం భవనంలో నిర్వహించిన విలేజ్ హెల్త్ శానిటేషన్, న్యూట్రీషియన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఎనీమియా (రక్తహీనత లోపం) బారిన పడకుండా ఉండేందుకు, బాలింతలకు, చిన్నపిల్లలు బరువు తక్కువ ఉండడం, చురుకుదనం, ఎదుగుదల లోపం శాతాన్ని తగ్గించడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరైన పోషకాహారాన్ని అందించాలని అన్నారు. రక్తహీనత లోపం కలిగిన గర్భిణీ స్త్రీలకు అవసరమైన మందులు అందించాలని వైద్యారోగ్య శాఖ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా తక్కువ బరువు ఉన్న, తక్కువ ఎత్తు ఉన్న వారి పట్ల శ్రద్ధ కనబరచాలని తెలిపారు. వ్యాధి నిరోధక టీకాలు వంద శాతం ఇవ్వాలని, తల్లులు తమ పిల్లలకు తల్లి పాలు అందించే విధంగా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు ఖచ్చితంగా 12 శాతం కంటే హిమోగ్లోబిన్ ఉండేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రీషియన్ డే ప్రతీ బుధవారం, శనివారం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఇచ్చే ఎంసీపీ కార్డులోని చివరి పేజీలో గల సూచనలను అర్థమయ్యేలా వివరించాలని, ఐరాన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వేసుకునేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, సీడీపీఓ అలేఖ్య, వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post