రహదారి ప్రమాదాలు జరగకుండా రోడ్ల మరమ్మతులు పూర్తి చేసి ప్రమాద సూచిక బోర్డులను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 14 (మంగళవారం).

రహదారి ప్రమాదాలు జరగకుండా రోడ్ల మరమ్మతులు పూర్తి చేసి ప్రమాద సూచిక బోర్డులను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి రహదారుల భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో రహదారుల కండిషన్ మరియు గత కొంత కాలంగా జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదాలపై నేషనల్ హైవే, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజనీర్లు మరియు రవాణా, పోలీస్ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి రోజు దాదాపు 6 వేల వాహనాలు రవాణాల ద్వారా జరుగుతుందని వర్షాకాలం రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్న సమయమని ఈ సమయంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. పరకాల నుండి కాలేశ్వరం వరకు జాతీయ రహదారిపై దాదాపు 200 గుంతలు ఏర్పడి వాహనాల రవాణాకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఆ గుంతలలో పడి వాహన ప్రమాదాలు జరిగి ప్రయాణికులకు గాయాల కావడమే కాకుండా గడిచిన రెండు నెలల కాలంలో దాదాపు 20 మరణాలు సంభవించాయని అన్నారు. గతంలో నిర్వహించిన రోడ్డు సేఫ్టీ సమావేశంలో జాతీయ రహదారి పొడవునా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని, గుంతలను పూడ్చాలని ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు స్పందించలేదని నేషనల్ హైవే అథారిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసి రేపటిలోగా అన్ని గుంతలను పూడ్చి వేసి వారంలోగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సూచిస్తూ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని, ఆర్ అండ్ బి రోడ్ నుండి నేషనల్ హైవే రోడ్ లోకి వెళ్లే చోటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యంగా కాలేశ్వరం మహాదేవపూర్ మధ్య భూపాలపల్లి పట్టణం నుండి చెల్పూర్ మధ్య రహదారి మరీ అధ్వానంగా ఉందని వెంటనే గుంతలను పూడ్చాలని నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యాసాగర్ ను ఆదేశించారు. భూపాలపల్లి పట్టణం నుండి చెల్పూర్ వరకు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ను ఆదేశించారు. అదేవిధంగా అధిక వర్షాలతో పలిమెల, మహాముత్తారం, టేకుమట్ల, మొగుళ్లపల్లి తదితర మండలాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాల వ్యాప్తంగా దెబ్బతిన్న ఆర్ అండ్ బి మరియు పంచాయతీరాజ్ రహదారులను, వంతెనలను గుర్తించి వెంటనే మరమ్మతు పనులను చేపట్టి సాధారణ ప్రజానీకానికి రవాణాకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆర్ అండ్ బి మరియు పంచాయతీ రాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. మేడారం జాతర సమీపిస్తున్నందున మేడారానికి అనుసంధానమైన అన్ని శాఖల రహదారులను మరమ్మతులు చేసి సిద్ధం చేయాలని అన్నారు. రెండు జిల్లాలలో వివిధ ప్రాంతాల్లో అవసరమైన బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జాతీయ రహదారి వెంట భారీ వాహనాలు ఎక్కడపడితే అక్కడ ముఖ్యంగా భూపాలపల్లి పట్టణ పరిధిలో పార్కింగ్ చేస్తున్నారని పార్కింగ్ కోసం మైలారం మరియు కాటారం లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను ఆదేశిస్తు వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలువకుండా పర్యవేక్షించాలని జిల్లా రవాణా శాఖ అధికారి వేణును ఆదేశించారు. ఆర్టీసీ బస్సులను ప్రజలకు ఇబ్బంది కలగకుండా రెండు జిల్లాల లోని మారుమూల ప్రాంతాలకు కూడా నడిపించాలని, బస్టాండ్ లలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ డిఎం ధరమ్ సింగ్ ను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కొరకు జాతీయ రహదారి నిర్వహణ అధికారులు నిబంధనల మేరకు అన్ని వసతులను కల్పించాలని రహదారుల వెంబడి అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని మరుగుదొడ్ల తో కూడిన వాహనాల పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా రవాణాశాఖ అధికారి వేణు, ఆర్ అండ్ బి ఇఇ వెంకటేష్, నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యాసాగర్, భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు, పంచాయతీ రాజ్ డిఇ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో మహేష్ బాబు, ఆర్టీసీ డిపో మేనేజర్ ధరమ్ సింగ్, ఎంవిఐ సంధాని మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post