ప్రచురణార్ధం
సెప్టెంబరు, 14 ఖమ్మం:
రాజకీయాలకు అతీతంగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేసారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరOలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి మంత్రి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో దళిత బంధు అమలు గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితబంధుకు ఖమ్మం జిల్లా చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి తెలిపారు. ఖమ్మం నగరానికి అతి సమీపంలో ఉన్న చింతకాని మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఎంపిక చేసిందని, దళితబంధు పథకంలో ఎటువంటి ఆంక్షలు లేవని, బ్యాంక్ లింకేజ్, మార్జిన్ మనీ సమస్యలేదని పూర్తిగా వందశాతం సబ్సిడీపై 10 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు మానవతా దృక్పధంతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులకు కూడా దళితబంధు వర్తిస్తుందని ముఖ్యమంత్రివర్యులు నిర్ణయించారని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపచేసి పేదరికాన్ని పోగొట్టి ఆర్థికంగా, సామాజికంగా దళిత కుటంబాలను బలోపేతం చేసేందుకు లబ్దిదారులకు ఆసక్తి గల రంగాలలో యూనిట్ల స్థాపనకు పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వ కల్పించిందని మంత్రి తెలిపారు. చింతకాని మండలంలోని 26 గ్రామపంచాయితీలకు 26 మంది జిల్లా స్థాయి అధికారుల నియామకం చేపట్టి వారం రోజులలోపు దళితబంధు ఖాతాలు ప్రారంబింపచేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. దీనితో పాటు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో దళితబంధు కమిటీలు ఉంటాయని పూర్తిగా దళితులతోనే ఇట్టి కమిటీలు ఏర్పాటవుతాయని వీటిలో 50 శాతం మహిళలకు స్థానం కల్పించబడుతుందని మంత్రి తెలిపారు. దళితోద్ధరణకోసం పాటుపడిన రిటైర్డు దళిత ఉపాధ్యాయులు, మేధావులను కమిటీ సభ్యులుగా నియమించడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యంతో వారం రోజులలోపు కమిటీలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే దళితబంధు అమలవుతున్న జిల్లాలలో డైరీల ఏర్పాటు, గూడ్స్ వెహికిల్స్, ట్రాక్టర్స్, ట్రాలీలకు అధికంగా డిమాండ్ వచ్చిందని, దీనితోపాటు లబ్ధిదారులకు ఆసక్తి గల యూనిట్ల స్థాపన ఉంటుందని, ఏ ప్రదేశంలోనైనా యూనిట్లను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ లబ్ధిదారునికి ఉంటుందని మంత్రి తెలిపారు. దీనితోపాటు రక్షణ నిధికింద 10 వేల రూపాయలు లబ్ధిదారుని వాటాతో పాటు మరో 10 వేల రూపాయలు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ను లబ్ధిదారుని ఖాతాకు జమచేస్తుందన్నారు. దళితుల జీవన ప్రమాణాలను మార్చే దళితబందును ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళాలని, ప్రతి ఒక్క దళిత కుటుంబాన్ని పేదరికం విముక్తి కల్గించేందుకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు తీసుకున్న నిర్ణయాలు ప్రభావం చూపే విధంగా ఉంటాయన్నారు. చింతకాని మండలంలోని సుమారు 4 వేలకు పైగా దళిత కుటుంబాలకు 450 కోట్లను దళితబంధు రూపంలో అందించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ కుమార్, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, తదితరులు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం ఖమ్మం వారిచే జారీచేయనైనది.