రాజన్న సిరిసిల్ల జిల్లా – భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా – భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు
సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(IDOC) లో గురువారం ఘనంగా జరిగాయి.

IDOC లో సరిగ్గా ఉదయం 09.00 గంటలకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ పతాకమును ఆవిష్కరించారు.
జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జిల్లా కలెక్టర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఆ వెంటనే జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేడుకల కు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన అభివృద్ధిని
వివరించారు.

పూర్తి ప్రసంగం వారి మాటల్లోనే
..
ప్రియమైన సోదర, సోదరీమణులారా!

 

74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన గౌరవనీయులు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ గారు, తెలంగాణ పవర్ లూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ గారు, సెస్ చైర్మెన్ గారు,
రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ , జిల్లా ప్రజలందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

గణతంత్ర దినోత్సవం భారతీయులందరికీ గొప్ప జాతీయ పండుగ. ఈ శుభ సమయాన మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో మహానీయులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకోవడం మన విధి. వారి అసమాన త్యాగాల ఫలితంగానే నేడు మనం ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రథమంగా నిలుస్తూ దేశానికి తలమానికంగా నిలుస్తున్నాయి.

 

జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన ధార్మిక, కార్మిక, క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి శ్రీ కె.తారకరామారావు మార్గదర్శనం, ప్రత్యేక చొరవతో గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

 

రైతుబంధు పథకం ద్వారా ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఇప్పటివరకూ పది విడతల్లో 1 లక్షా 28 వేల 361 మంది రైతులకు 1 వేయి 207 కోట్ల రూపాయలను ముందస్తు పంట పెట్టుబడి క్రింద రైతుల ఖాతాలలో నేరుగా ప్రభుత్వం జమ చేసింది.

రైతులకు సుస్థిర ఆదాయం రావాలి, మెరుగ్గా బ్రతకాలి అనే ఉద్దేశ్యంతో తెలంగాణాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రైతులు తమ పంట ఉత్పత్తులను నిలువచేసుకోవడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. 1 వేయి 476 మంది వివిధ కారణాలతో అకాల మరణం చెందగా వారి వారసులకు 73 కోట్ల 80 లక్షల బీమా పరిహారం రైతుబీమా పథకం ద్వారా ప్రభుత్వం చెల్లించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 57 క్లస్టర్ ల పరిధిలో రైతువేదికలను నిర్మించింది. సాగు విస్తీర్ణం పెరగడంతో నర్మాలలో 309 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీయల్ పార్క్ లను ఏర్పాటు చేస్తుంది. వేములవాడ మండలం నాంపల్లి గ్రామంలో దక్కన్ అగ్రి రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 35 ఎకరాలలో ధాన్యపు ఆధారిత ఎథనాల్ డిస్టిలరీ ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ల ద్వారా 55 వేల 980 ఎకరాలకు మొత్తం 2 లక్షల 52 వేల 372 ఎకరాలకు సాగునీరు అందుతుంది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా 2 వేల కోట్ల భారీ పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధినిచ్చేలా మధ్యమానేరు లో 367 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అక్వాహబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది.

మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత త్రాగునీరు అందిస్తూ దేశంలోనే తొలిసారిగా ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేస్తోన్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేకతను చాటుకుంటుంది.

ప్రభుత్వం గూడు లేని పేద వారికి అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మితమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పైసా ఖర్చు లేకుండా కేటాయిస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు 3 వేల 411 ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయడం జరిగింది.

హరితహారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పచ్చదనం పెంపునకు ప్రణాళికాబద్ధంగా కృషి జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది విడతలలో 4 కోట్ల 67 లక్షల మొక్కలను జిల్లా వ్యాప్తంగా నాటడం జరిగింది

అభాగ్యుల గౌరవం పెంచేలా “ఆసరా” పథకం ను ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 1 లక్షా 20 వేల 811 మంది నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు,గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు ప్రతినెల 25 కోట్ల 90 లక్షల రూపాయలను పెన్షన్ల క్రింద పంపిణీ చేస్తుంది.

ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సహాయం అందించే కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 19 వేల 908 మందికి 182 కోట్ల 57 లక్షల రూపాయలు, షాదీ ముబారక్ పథకం ద్వారా 820 మందికి 7 కోట్ల 68 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశాం.

నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో రక్తనిధి, మాతాశిశు సంరక్షణ కేంద్రం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, డయాలసిస్ కేంద్రంను రోగుల సౌకర్యార్థం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వైద్య విద్య పటిష్టతకు ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉండగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్లకు మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. త్వరలోనే మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభం కానున్నాయి.

అప్పుడే పుట్టిన నవజాత శిశువుల కొరకు ప్రత్యేకంగా NBCU వార్డు తో పాటు అన్నీ అధునాతన వైద్య సదుపాయాలను అందజేస్తుంది. వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రజలందరి ఆరోగ్య సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ హెల్త్ ప్రొఫైల్ అనే కార్యక్రమాన్ని చేపట్టి .. పైలెట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల ను ఎంపిక చేసి అమలుచేస్తుంది.

జిల్లాలో ఇప్పటి వరకు 16 వేల 74 మంది బాలింతలకు కె.సి.ఆర్ కిట్ లను పంపిణీ చేయడం జరిగింది.

రాష్ట్రాన్ని సంపూర్ణ అంధత్వ రహిత తెలంగాణాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తుంది.

జిల్లా కేంద్రం సిరిసిల్లలో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా అన్ని హంగులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం 64 కోట్ల 70 లక్షల రూపాయలతో సర్వాంగ సుందరంగా నిర్మించబడి అందుబాటులోకి వచ్చింది.

వరి సాగు చేస్తున్న రైతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ వారు పండిస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వ మద్ధతు ధరకు కొనుగోలు చేస్తుంది.

దళితుల అభ్యున్నతి కోసం చేపట్టిన దళితబంధు పథకంలో భాగంగా 206 మంది లబ్దిదారులను ఎంపిక చేసి పథకాలను గ్రౌండింగ్ చేసే పనులు కొనసాగుతున్నాయి.

జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద 172 పాఠశాలల్లో విద్యుద్ధీకరణ, త్రాగునీటి సరఫరా, అదనంగా ప్రహారీ గోడ, టాయిలెట్ల నిర్మాణం, వంటగది నిర్మాణం, తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపడుతున్నాం. గౌరవ మంత్రి శ్రీ కె.తారకరామారావు గారి ప్రత్యేక చొరవ, మార్గదర్శనంతో జిల్లాలోని పది పాఠశాలల్లో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ కార్పోరేట్ సంస్థల సహకారంతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.

సిరిసిల్ల అంటే అభివృద్ధికి నోచుకోని పట్టణం, విషాద పట్టణం అనే మరకలు చెరిపి వేసుకుని…శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా… అభివృద్ధికి చిరునామాలా, ఆహ్లాద వాతావరణాన్ని తనలో ఇముడ్చుకున్న పట్టణంగా ఎదుగుతుంది. అనేక రంగాల్లో దేశానికి, రాష్ట్రానికి సిరిసిల్ల ఆదర్శంగా నిలుస్తోంది. సిరిసిల్ల పట్టణంలో మౌళిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను 100 కోట్లకు పైగా రూపాయలతో ప్రభుత్వం చేపడుతుంది. సిరిసిల్ల పట్టణంలో నిర్మించిన కొత్త చెరువు బండ్ ను, రాజీవ్ నగర్ లో నిర్మించిన మినీ స్టేడియం ను ప్రారంభించుకున్నాం. అడవుల పునరుద్ధరణలో భాగంగా సిరిసిల్ల మున్సిపాలిటీకి సమీపంలో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు, వినోదం పంచేలా 6 కోట్ల రూపాయలతో వెంకటాపూర్ శివారులో అటవీ, మున్సిపాలిటీ శాఖల సంయుక్త సహకారంతో పోతిరెడ్డిపల్లె రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో 50 హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్ పార్కును ఏర్పాటు చేసుకున్నాం.

జిల్లాలోని 255 గ్రామ పంచాయితీలలో నర్సరీలు, డంపింగ్ యార్డులు, కంపోస్టు షెడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశాం. ప్రతీ ఇంటిలో తడి, పొడి చెత్తను సేకరించేందుకు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పట్టేందుకు ప్రతీ గ్రామ పంచాయితీకి ట్రాక్టర్, ట్రాలీని ప్రభుత్వం అందజేసింది. ఫలితంగా గ్రామాలలో పరిశుభ్రత, పచ్చదనం పెరిగింది.

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 సర్వేలో జిల్లా గత రెండు మాసాలుగా అత్యుత్తమ పనితీరుతో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని చేజిక్కించుకోవడం మనందరికీ గర్వకారణం, రాష్ట్ర మంత్రి శ్రీ కె.తారకరామారావు గారి మార్గదర్శనం, స్థానిక ప్రజాప్రతినిధులు, క్షేత్ర అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందని తెలుపుతున్నాను.

జిల్లా కేంద్రం సిరిసిల్లతో సమాంతరంగా దక్షిణ కాశీగా పేరు గాంచిన ధార్మికక్షేత్రం వేములవాడను ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది. 2 కోట్ల 71 లక్షల రూపాయలతో వెజ్ మార్కెట్, 4 కోట్ల 50 లక్షల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. మూలవాగు తీరాన నిర్మించిన వైకుంటధామంను ప్రారంభించుకున్నాం. వేములవాడ టెంపుల్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో ప్రణాళికబద్ధ అభివృద్ధికి కృషి జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు తర్వాత ప్రతీ ఏటా మహాశివరాత్రి జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మాదిరే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే మహాశివరాత్రి జాతరను మంత్రి శ్రీ కె.తారకరామారావు గారి మార్గదర్శనంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

భూ సంస్కరణల్లో భాగంగా భూముల వివరాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ తో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు చేరువయ్యాయి. మొన్నటివరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ధరణి తహశీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా ఇవ్వడంతో అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు, పెండింగ్ మ్యూటేషన్లు, కోర్టు కేసులు సహా వివిధ కేటగిరీల కింద వచ్చిన మొత్తం 33 వేల 700 దరఖాస్తులకు పరిష్కారం చూపాం. ధరణిలో ప్రజలు 48 వేల 100 స్లాట్లు బుక్ చేసుకోగా 46 వేల 927 లావాదేవీలను పూర్తి చేశాం.

కష్టేఫలి అని విశ్వసించే పవర్ లూం చేనేత కార్మికుల జీవితాలలో వెలుగులు నింపేందుకు వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. మరమగ్గాల కార్మికులకు, ఆసాములకు నిరంతరాయంగా ఉపాధి కల్పించడానికి 2 వేల 500 కోట్ల రూపాయల విలువైన బతుకమ్మ చీరల ఉత్పత్తి క్రిస్మస్, రంజాన్ తదితర అనుమతులను ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రభుత్వ ఆర్డర్ వలన 15 వేల మందికి పైగా కార్మికులకు నెలకు ఒక్కొక్కరికి 16 వేలకు పైగా వేతనం పొందుతున్నారు.

అపెరల్ పార్క్ పనులు జరుగుతున్నాయి. ఈ అపెరల్ పార్క్ నిర్మాణం పూర్తి అయితే 8 వేల మంది మహిళలకు గార్మెంట్ రంగంలో ఉపాధి లభించనుంది. నేత కార్మికులకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రభుత్వం నేతన్న భీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.

శాంతి సామరస్యం వెల్లివిరిసిన సమాజంలో మాత్రమే వికాసం సాధ్యమవుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీలేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుకు సాగుతుంది.

 

శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమవుతున్న జిల్లా పోలీస్ అధికారి గారికి, ఇతర పోలీస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు.

 

ఇదే స్పూర్తితో గౌ. మంత్రి శ్రీ కె. తారకరామారావు గారి మార్గదర్శనంలో అన్ని రంగాల్లో ధార్మిక, కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను.

జిల్లాలో ప్రభుత్వ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభావవంతంగా అమలు చేసేందుకు సహకారం అందిస్తున్న గౌ. మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారికి, గౌ. పార్లమెంట్ సభ్యులు, గౌ. శాసన మండలి సభ్యులు, గౌ. శాసన సభ్యులు, ప్రభుత్వ సంస్థలు, కమిటీల గౌ. చైర్మన్ లు, డైరెక్టర్లు, సభ్యులు, స్ధానిక గౌ. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్చంధ సంస్ధ ప్రతినిధులకు ఈ సందర్భంగా శుభాభినందనలు తెలుపుతున్నాను. జిల్లా అభివృద్దికి సహకారం అందిస్తున్న గౌ. న్యాయమూర్తులకు, వారి సిబ్బందికి శుభాభినందనలు తెలుపుతున్నాను. వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు ప్రత్యేక ప్రణామాలు.

నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రజలను చైతన్యపరచడంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వివరించి, ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి గడపకు చేరేలా తమవంతు సహాకారం అందిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల, బాలికలకు నా ఆశీస్సులు.

 

అందరికీ… మరోమారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

 

 

జై హింద్! జై తెలంగాణ!!

 

అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన అధికారులు ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేసారు.

 

Share This Post