రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు, సమన్యాయం, ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న పథకాలు అర్హులందరికీ అందాలనేదే న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశ్యం – మహబూబ్ నగర్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్. ప్రేమావతి

రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు, సమన్యాయం, ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న పథకాలు అర్హులందరికీ అందాలనేదే న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశ్యమని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్. ప్రేమావతి అన్నారు. శనివారం మన్ననూర్ గిరిజన భవనం లో గిరిజనులు, ఆదివాసీల హక్కుల రక్షణ పై జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికిని రాజ్యాంగం ద్వారా కల్పిస్తున్న హక్కులు, సమన్యాయం అనేది గ్రామీణ స్థాయిలో అందరికి అందడం లేదని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవల అధికార సంస్థ, జిల్లా, మండల న్యాయ సేవల అధికార సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆజాదిక అమృత మహోత్సవాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆన్నీ మారుమూల ప్రాంతాల్లో అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు ప్రజలకు చట్టాలపై న్యాయ సేవలు, సలహాలు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు జరుగుచున్నాయని తెలిపారు. ఆర్టికల్ 39ఎ రూపంలో ప్రతి పౌరునికి న్యాయం అందాలని నిర్దేశిస్తుందని, ఆర్టికల్ 14, 27 (1) ప్రాకారం ప్రతి పౌరునికి సమన్యాయం సమాన అవకాశాలు కల్పించాలని సూచిస్తుందన్నారు. అందరికి సమన్యాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో 1987 లో యాక్టు వచ్చినప్పటికిని 1995 లో అమలులోకి తెచ్చి న్యాయ సేవల అధికార సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళల పై అత్యాచారాలు, గృహహింసలు, లైంగిక వేధింపులు వంటి దూరాగతాలను అరికట్టడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, పొక్సో యాక్టు చట్టం ద్వారా సత్వర న్యాయం జరిగి దోషులను త్వరగా శిక్షలు పదేవిధంగా ప్రత్యేక కోర్టులు దోహదపడుతుందన్నారు. శిక్షలు త్వరగా అమలు చేయడం వల్ల తప్పులు చేయడానికి భయపడే అవకాశం ఉంటుందన్నారు. శిక్షలు త్వరగా పడేందుకు 164 సెక్షన్ ప్రకారం బాధితురాలి వాంగ్మూలం ఘటన జరిగిన 3 రోజుల్లో రికార్డు చేసేవిధంగా పోలీస్ శాఖ సహకరించాలని కోరారు. అదేవిధంగా బాధితులకు అందాల్సిన పరిహారం సకాలంలో అందేవిదంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను సూచించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. పిల్లలు పోషకాహార లోపంతో బాధపడకుండా సంక్షేమ శాఖ, ప్రాంతీయ గ్రామీణాభివృద్ధి శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గిరిజన ఆదివాసీల ప్రాంతమైన మన్ననూర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచి అభివృద్ధి సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలు, పౌష్టికాహారం వంటి విషయాల్లో ప్రత్యేక చొరవ చూపించడం జరుగుతుందన్నారు. అడవి లోపల ఉన్న చెంచు పెంటల ప్రజలను బయటికి తీసుకువచ్చి వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏ ఏ పథకాలకు ఎవరు అర్హులు వాటిని పొందడానికి ఏంచేయాలి అనే అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పోడు భూముల విషయంలో మాట్లాడుతూ ఇప్పటికే న్యాయ బద్దంగా అర్హత కలిగిన వారందరికీ పట్టాలు ఇవ్వడం జరిగిందని,ఇంకా ఎవరైనా మేము న్యాయబద్ధంగా అర్హులము అని అనుకునేవారికి నవంబర్ మొదటి వారం నుండి ప్రారంభమయ్యే దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేసారు.
జిల్లా ఎస్పీ డా.వై.సాయిశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం పోలీస్ శాఖకు 4జి లను నిర్ములించడానికి ఆదేశించడం జరిగిందని అందులో గంజాయి, గుడుంబా, గుట్కా, గ్యాంబ్లింగ్ ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి, గుడుంబా, గుట్కా, గ్యాంబ్లింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వీటిని విడనాడి ప్రభుత్వం ద్వారా జల్పిస్తున్న ఇతర ఉపాధి అవకాశాలను చూసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ చేయించుకోవాలని సూచించారు. అచ్ఛంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట శెట్టి, నాగర్ కర్నూల్ జిల్లా నాల్గవ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి ఎస్. రవికుమార్ చట్టాల పై అవగాహన కల్పించారు.
అనంతరం ఆదివాసీ అమ్మాయిల సాంప్రదాయ నృత్యం చూపరులను కనువిందు చేసినది. జిల్లా సంక్షేమ శాఖ ద్వారా బాధితులకు వినికిడి యంత్రాలు, 300 మంది కరోనా బాధితులకు పొష్టికాహారంతో కూడిన ఆహార పదార్థాలు, చక్రాల కుర్చీలు తదితరములు అతిథుల చేతుల మీదుగా వితరణ చేశారు. ఆదివాసీల అవగాహన కై సఖి వన్ స్టాప్ కేంద్రం వారు, ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, గ్రామీణాభివృద్ధి, ఐ.టి.డై వారి ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి మహబూబ్ నగర్ యం. సంధ్యా రాణి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్. వెంకట్రామ్, అచ్ఛంపేట జూనియర్ సివిల్ జడ్జి ఏ. చైతన్య, రీజినల్ డైరెక్టర్ ఆర్.డి.టి శ్రీశైలం ప్రాజెక్టు పుష్పాలత, జిల్లా అధికారులు , పెద్దమొత్తంలో గిరిజనులు, ఆదివాసీలు తదితరులు పాలగిన్నారు.

Share This Post