రాజ్యాంగం ద్వారా కల్పిస్తున్న అన్ని హక్కులు ధనిక బీద, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నదే న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, మహబూబ్ నగర్ జిల్లా జడ్జి ఎస్. ప్రేమావతి అన్నారు. పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శనివారం నారాయణపేట జిల్లాలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలలకు స్నేహపూర్వక న్యాయ సేవలు మరియు వారి రక్షణ పై ఏర్పాటు చేసిన న్యాయ సేవాధికార సంస్థ మెగా క్యాంపుకు జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అగుచున్న నేటికీ అందరికి సమాన హక్కులు లభించడం లేదని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో వెళ్లి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా చట్టాలు, హక్కుల పై అవగాహన కల్పించేందుకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. నిరక్షరాస్యత, పేదరికం, తెలియకపోవడం వల్ల చాలా మంది న్యాయపరమైన తమ హక్కులు పొందటం లేదన్నారు. పిల్లలకు స్నేహపూర్వక న్యాయ సేవలు మరియు వారి రక్షణ పై అవగాహన కల్పించడం సైతం న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాల్లో ఒక భాగమన్నారు. నారాయణపేట జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతాయని వీటిని అరికట్టేందుకు జిల్లా పోలీసు శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ ప్రొటెక్షన్, స్వచ్చంద సంస్థలు బాగా కృషి చేశాయని ప్రశంసించారు. నిరక్షరాస్యత, సంప్రదాయమని, మచ్చ వస్తుందని వివిధ కారణాల వల్ల బాల్య వివాహాలు చేస్తున్నారని కానీ ఇది చట్టప్రకారం నేరమని తెలిపారు. అమ్మాయి ఆరోగ్య సమస్యల తో పాటు పుట్టబోయే పిల్లలు తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురి అవుతారన్నారు. ఈ విషయంలో పిల్లలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని, ఇందుకు పుస్తకాలు చదవాలన్నారు. చట్టం, పిల్లల హక్కులు అయిన పౌష్టికాహారం, విద్యా హక్కు, తమ మనోభావాలు, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, వ్యక్తిగత స్వెచ్చ పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి నచ్చచెప్పాలన్నారు. విద్యార్థులు చట్టంలో ఉన్న ఆర్టికల్స్ ను చదివి అర్థం చేసుకోవాలని తెలిపారు. అయితే ప్రతి ఒక్కరు తమ హక్కులతో పాటు బాధ్యతలను విస్మరించకూడదని గుర్తు చేశారు. అంతకు ముందు గురుకుల పాఠశాల విద్యార్థులు ముఖ్య అతిథిని కవాతుతో స్వాగతం పలికారు. ప్రాంగణంలో పోలీస్ శాఖ, సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, సి.డబ్ల్యూ.సి ద్వారా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించి కితాబు ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ డా. చేతన మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు చట్టాల పై అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు చట్టాల పై అవగాహన కలిగి నేరాలు చేయకుండా ఉండేందుకు దోహద పడుతుందన్నారు. ప్రజలకు తమ హక్కులను కల్పించేందుకు పోలీస్, న్యాయ శాఖ కలిసి పనిచేస్తుందని తెలియజేసారు. అమ్మాయిలకు అబ్బాయిలతో సమాన హక్కులు పొందేందెంకు హక్కు ఉందని దీనికి అమ్మాయిలు తమ గొంతుకను వినిపించాలని పిలుపునిచ్చారు. అమ్మాయిల హక్కులను కాపాడటానికి అనేక శాఖలు, సంస్థలు పని చేస్తున్నాయని వెల్లడించారు.
అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి మాట్లాడుతూ మనిషికి ఇంగిత జ్ఞానం, సామాజిక బాధ్యతలు, స్వేచ్ఛ జీవితం నుండి చట్టాలు ఏర్పడ్డాయని అన్నారు. చట్టాల పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు. లీగల్ సర్వీస్ ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న న్యాయ సలహాలు, హక్కుల పై అవగాహన కల్పిస్తున్నారని కొనియాడారు. నారాయణపేట జిల్లా బార్ అసోసియేషన్ ఆదక్షులు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో మండల న్యాయ సేవాధికార సంస్థ ప్రతి గ్రామంలో ప్రజలకు చట్టాల పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుండి 7 గ్రూపులు గా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు శుభావల్లి, జూనియర్ సివిల్ జడ్జి రాజేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్, చైల్డ్ వెలిఫెర్ కమిటీ చైర్మన్ అశోక్ శ్యామల, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ దేవసేన, న్యాయవాదులు, ఇతర అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.