పత్రిక ప్రకటన
తేది: 25-1-2023
నాగర్ కర్నూల్ జిల్లా.
రాజ్యాంగం ద్వారా ప్రతి ఓటరుకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా ఉయ్యాలవాడ లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు ఓటు యొక్క ప్రాధాన్యతను వారి బాధ్యతను వివరించి చెప్పారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఆయుధంగా మలుచుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తన ఓటును అర్హులైన అభ్యర్థికి వేసుకోవాలన్నారు. ఓటు వేస్తే నాకేంటి లాభం అని అనుకోవద్దని సమాజంలో ఏదైనా మార్పును కోరుకునే వారు ఆ మార్పు జరగాలంటే తన ఓటు ద్వారానే సాధ్యపడుతుందన్నారు. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీని ప్రామాణికం చేసుకొని 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతకు ఓటరు జాబితాలో పేరు నమోదుకు అవకాశం ఇచ్చేవారని కానీ ఎన్నికల సమయంలో చాలా మంది యువత ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోలేకపోవడాన్ని గుర్తించి గత రెండు మూడు సంవత్సరాల నుండి ప్రతి మూడు నెలలకు 1వ తేదీని ప్రామాణికం చేసుకొని 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు కొరకు ఫారం 6 ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ మొబైల్ ఫోన్ ద్వారా సైతం నమోదు చేసుకోవచ్చని తెలియజేసారు. యువత అత్యధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఒకప్పుడు చదువు రాని వారికి మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదని కానీ భారత దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు. ప్రపంచంలో ని ఇతర ప్రజాస్వామ్య దేశాలకు భారత దేశం ఒక దిక్సుచి గా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదనవు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యం 1947 లో వస్తే 1950 జనవరి 25వ తేదీన ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అందుకే ఈ రోజును జాతీయ ఓటర్స్ దినోత్సవం గా ప్రతి సంవత్సరం జరుపుకుంటామన్నారు. ఎలక్షన్ కు సంబంధించి టోల్ ఫ్రీ నెంబరు సైతం 1950 గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఓటరు, ఓటు నియమ నిబంధనల గురించి రాజ్యాంగంలో పేర్కొన్నట్లు వివరించారు. ఓటరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తన ఓటును అమ్ముకోకుండా స్వేచ్ఛగా తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఓటు యొక్క ప్రాధాన్యతను ఇతరులకు తేలియజేయాలని కోరారు.
అనంతరం విద్యార్థుల తో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. మొదటిసారి ఓటు హక్కు పొందిన విద్యార్ధులకు కలెక్టర్ తన చేతుల మీదుగా ఎపిక్ కార్డులను అందజేసారు. ఓటు ప్రాధాన్యత పై పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన వక్తుత్వ పోటీలలో మొదటి బహుమతి పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు మెమోంటోను ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో డి.ఈ.ఓ గోవిందరాజులు, బి.సి. సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, డి.పి.ఆర్. ఓ సీతారాం, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ వెంకటరమణ, ఏ.ఓ శ్రీనివాస్ , విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
—————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.