రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు జిల్లా జడ్జి శ్రీమతి సునీత

 

నిజామాబాదు, జనవరి 25 : భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన ఓటు హక్కు ఎంతో గొప్ప ఆయుధం అని నిజామాబాదు జిల్లా జడ్జి శ్రీమతి సునీత అభివర్ణించారు. ఓటు హక్కు ఔన్నత్యాన్ని గుర్తెరిగి అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలికారు.

జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రగతి భవన్ లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్.నాగరాజు తదితరులు భాగస్వాములయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మీదట, కలెక్టర్ నారాయణరెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుశీల్ చంద్ర, రాష్ట్ర గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ శశాంక్  గోయల్ సందేశాలను వినిపించారు.

ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీమతి సునీత మాట్లాడుతూ, మనల్ని చక్కగా పరిపాలించే, మనకు నచ్చిన పాలకులను ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. మన ఈ బాధ్యతను మనం  సక్రమంగా నిర్వర్తించినప్పుడే మన హక్కులను కాపాడుకోగల్గుతామని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కో ఓటు ఎంతో విలువైనదని, ఒక్క ఓటు తేడాతో పరిస్థితులు తారుమారు అవుతాయని గుర్తు చేశారు. గ్రామాలతో పోలిస్తే పట్టాన ప్రాంతాల్లోనే ఒకింత తక్కువ ఓటింగ్ నమోదవుతోందని, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. అభిమాన నటుడు, నటి సినిమా వస్తే టిక్కెట్ల కోసం గంటలు గంటలు క్యూలో నిలబడతారని, ఎంతో విలువైన ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమో ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలని సూచించారు. మన కుటుంబం నుండే మార్పు అనేది ప్రారంభం కావాలని, కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారందరు ఓటు వేసేలా చూడాలని, అలాగే మన చుట్టూ ఉన్న వారిని కూడా చైతన్య పర్చాలని హితవు పలికారు. తదుపరి వచ్చే ఎన్నిక ఏదైనా సరే, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగులో పాల్గొని, నిజామాబాదు జిల్లాను ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ, భిన్నత్వంతో కూడుకుని ఉన్నభారత దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలే పాలన సాగించేందుకు ఓటు హక్కు దోహదపడుతోందని అన్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా వుంటాయని, ప్రజలు తమకు నచ్చిన వారిని ఎన్నుకునే అవకాశం కల్పించాలనే గొప్ప సంకల్పంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ భారత రాజ్యాంగం ద్వారా దేశ పౌరులకు ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. ఓటు ప్రాముఖ్యతను గుర్తించాలని, దేశ భవిష్యత్తును, మన, మన పిల్లల భవిష్యత్తును కాంక్షిస్తూ మంచి నాయకులను ఎన్నుకోవాలని హితవు పలికారు. దురదృష్ట వశాత్తు సోషల్ మీడియా ప్రభావంతో అక్కడక్కడా కులం, మతం, ప్రాంతం పేరుతో ఎన్నికల్లో విభజనకు తావు కల్పిస్తున్న పరిస్థితులు తెర మీదకు వస్తున్నాయని, అలాంటి వాటికి ఆస్కారం కల్పించవద్దని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని, ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తమ గురుతర బాధ్యతగా భావించాలని సూచించారు. అక్షరాస్యులు ఎక్కువగా వుండే పట్టణ ప్రాంతాల్లోనే తక్కువగా పోలింగ్ నమోదు అవడం బాధ కలిగించే విషయమని అన్నారు. గంట పాటు క్యూలో నిలబడి ఓటు వేస్తే తమ ఐదేళ్ల భవిష్యత్తును చక్కగా నిర్దేశించుకున్న వారవుతాని కలెక్టర్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా మన ఓటు ఎక్కడ వుంది, ఎవరిని సంప్రదించాలి, బూత్ లెవెల్ అధికారి ఎవరు తదితర అన్ని వివరాలను సెల్ ఫోన్లో చూసుకోవచ్చని అన్నారు. కాగా జిల్లాలో 5200 పైచిలుకు మంది కొత్త ఓటర్లకు ఓటరు కార్డులు అందించామని తెలిపారు. ఈ సందర్భంగా పలువు కొత్త ఓటర్లకు జిల్లా జడ్జి, కలెక్టర్లు తమ చేతుల మీదుగా ఓటరు కార్డులు అందించారు.  ఉత్తమ బీ ఎల్ ఓ గా సేవలందించిన అనితకు 10 వేల రూపాయల నగదు పారితోషికం అందించి సత్కరించారు. ఆమెతో పాటు ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న పలువురు సీనియర్ సిటిజెన్లను కూడా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్ర మిశ్ర, ట్రైనీ కలెక్టర్ మకరంద్, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నూతన ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post