రానున్న ఏడాది కాలంలో అటవీ శాఖ తరపున చేపట్టాల్సిన పనులు, రోడ్ మ్యాప్ పై అన్ని సర్కిళ్లకు చెందిన ప్రధాన అధికారులతో అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో వర్క్ షాప్ జరిగింది.

*అటవీ రక్షణ, పునరుద్దరణ, పచ్చదనం పెంపుకు మొదటి ప్రాధాన్యత*                                                                          *పల్లె- పట్టణ ప్రగతి, రానున్న హరితహారం సీజన్ కు సిద్దంగా ఉండాలి*

— అటవీ శాఖ సర్కిల్ హెడ్స్ రెండు రోజుల వర్క్ షాప్ లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియల్.

అటవీ రక్షణకు ప్రాధాన్యతను ఇస్తూనే, క్షీణించిన అటవీ పునరుద్దరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని, రాష్ట్ర మంతటా మరింతగా పచ్చదనం పెంపు అటవీశాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది మొదటి ప్రాధాన్యత కావాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్ అన్నారు.

రానున్న ఏడాది కాలంలో అటవీ శాఖ తరపున చేపట్టాల్సిన పనులు, రోడ్ మ్యాప్ పై అన్ని సర్కిళ్లకు చెందిన ప్రధాన అధికారులతో అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో వర్క్ షాప్ జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సర్కిల్ హెడ్స్ సమావేశానికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), హెచ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ అధ్యక్షత వహించారు. అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు మొత్తం పది సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు (అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్), రెండు టైగర్ రిజర్వులకు చెందిన ఫీల్డ్ డైరెక్టర్లు (అమ్రాబాద్, కవ్వాల్) ఈ రెండు రోజుల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణకు హరితహారం ద్వారా చేపట్టిన పనులు, ఫలితాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, ప్రభుత్వ ప్రోత్సాహం, అటవీ శాఖలో ప్రతీ ఒక్కరి కృషి వల్ల ఇది సాధ్యమైందని పీసీసీఎఫ్ అన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న ఏడాది కూడా లక్ష్యాల మేరకు, ఫలితాలు చూపించే దిశగా పనిచేయాలన్నారు. వచ్చే నెలలో మొదలయ్యే పల్లె, పట్టణ ప్రగతితో పాటు, రానున్న సీజన్ హరితహారం కోసం ముందస్తు ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున అగ్ని ప్రమాదాల నివారణలో క్షేత్ర స్థాయి సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వణ్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

అభివృద్ది కార్యక్రమాలకు అటవీ భూమి మళ్లింపు తప్పనిసరి అయినప్పుడు ప్రభుత్వ ప్రాధామ్యాలకు అనుగుణంగా అనుమతుల ప్రక్రియ వేగంగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. అదేవిధంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులను కూడా అదే వేగంతో చేయాలని పీసీసీఎఫ్ తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో వివిధ శాఖల మధ్య సమన్యయం సాధించాలన్నారు.

ఇక వన్యప్రాణుల కోసం రెండు పులుల అభయారణ్యాల్లో గడ్డి మైదానాల పెంపుకు (గ్రాస్ ప్లాట్స్) ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో  అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల పనులను వేగంగా పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మేరకు అటవీ శాఖలో పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం అయ్యేలా టీపీఎస్సీకి సహకారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు.

సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు వినయ్ కుమార్, ఎం.సీ. పర్గెయిన్, ఎస్.కే.సిహ్హా, ఫారెస్ట్ అకాడెమీ డైరెక్టర్ రాజారావు,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share This Post