రామడుగు మండలం లోని శానగర్ లో నిర్వహించిన న్యాయ సేవల అవగాహన సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంజీ ప్రియదర్శిని. పాల్గొన్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గరిమా అగర్వాల్.

పత్రికా ప్రకటన తేదీ: 14-11-2021
కరీంనగర్

అందరికీ న్యాయం అందించడమే న్యాయసేవాధికార సంస్థ లక్ష్యం

న్యాయసేవాధికార సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

న్యాయ సేవల అవగాహన ముగింపు సదస్సులో కార్యక్రమంలో

జిల్లా సెషన్స్ జడ్జి ఎం. జి. ప్రియదర్శిని

పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

ఘనంగా ముగిసిన పాన్ ఇండియా అవగాహన కార్యక్రమాలు

00000

పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ న్యాయ సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని జిల్లా సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం. జి. ప్రియదర్శిని అన్నారు.

ఆదివారం రామడుగు మండలం షానగర్ గ్రామంలోని లక్ష్మి గార్డెన్స్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ సేవల అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ప్రియదర్శిని మాట్లాడుతూ మహిళలు సెల్ ఫోన్లు, టీవీ సీరియల్స్ చూడడానికి మాత్రమే పరిమితం కాకుండా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సం.లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, ఉచిత న్యాయ సేవల పై దేశ వ్యాప్తంగా మారుమూల గ్రామస్థాయి వరకు అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరికీ న్యాయ సేవల పై అవగాహన కల్పించామని తెలిపారు. జాతీయ,రాష్ట్ర, జిల్లా,మండల న్యాయ సేవాధికార సంస్ధలు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, బాధ్యతలతో పాటు,రాజ్యాంగం లోని ఆర్టికల్ 39 ఏ లో పేర్కొన్న విధంగా పేదలకు,బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు, అందరికి న్యాయం గురించి గ్రామ స్థాయి లో ప్రతి ఒక వ్యక్తికి తెలిసే విధంగా అవగాహన కల్పించామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 1244 గ్రామాలకు బృందాలుగా వెళ్లి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించామని తెలిపారు. ఆస్తి, భూ తగాదాల కు సంబంధించి కేసులకు చాలా మంది ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికి అప్పులు చేసి న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన లేకపోవడం,తెలియక పోవడం వల్లనే ఆర్ధిక భారం పడుతుందని, క్రిమినల్,సివిల్ కేసుల్లో కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ద్వారానే న్యాయవాదికి ఫీజు చెల్లించి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని అన్నారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ పేద ప్రజలు అందరూ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చునని తెలిపారు. తెల్లకాగితంపై దరఖాస్తు రాసి న్యాయసేవాధికార సంస్థలో సమర్పిస్తే పరిష్కారం లేదా రాజీకుదుర్చుకుని సమస్య పరిష్కరించుకోవచ్చని అన్నారు.
రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి పౌర హక్కు, సమానత్వం, జీవించే హక్కు ఉన్నాయని అన్నారు. హక్కులకు భంగం కలిగినప్పుడు పేద ప్రజలు మహిళలు, జిల్లా లేదా మండల న్యాయసేవాధికార సంస్థలను ఆశ్రయించి సహాయం పొందాలని అన్నారు. ఇప్పుడు న్యాయ సేవలు ప్రజల ముంగిటకే వచ్చాయని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లల కోసం ప్రత్యేకంగా పోక్సో చట్టం అమల్లోకి వచ్చిందని, పిల్లలపై జరిగే నేరాలు, ఘోరాలకు న్యాయసేవాధికార సంస్థ నుంచి సహాయం పొందాలని, ప్రభుత్వం నుంచి పరిహారం కూడా పొందవచ్చునని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కళాకారుల బృందం కళాకారులు మూఢనమ్మకాలు, న్యాయ సేవలు పొందడం గురించి పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

న్యాయవాదులు కె. రాజేందర్ సమాచార హక్కు చట్టం, కే.లక్ష్మణ్ గృహహింస చట్టం, సీనియర్ సివిల్ జడ్జి ప్రసాద్ న్యాయసేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలు, చట్టాల గురించి ప్రసంగించారు.

 

చైల్డ్ లైన్ సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన 1098 పోస్టర్ ను జిల్లా జడ్జి, అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. పిల్లలకు ఆపద కలిగిన సమయంలో 1098 కు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి తగిన సహాయం అందిస్తామని చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్ తెలిపారు.

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల బాలికలకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు, మండలాల వారీగా ఉచిత న్యాయ సేవల పై మారుమూల గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించిన న్యాయవాదులు, ఎన్జీవోలు, పారా లీగల్ వాలంటీర్ లకు, ఉచిత న్యాయ సేవలు సలహాలు మూఢనమ్మకాల తొలగింపు తదితర అంశాలపై గ్రామాల్లో పాటలు పాడి ప్రజలను చైతన్యవంతులను చేయడంతోపాటు న్యాయ సేవల గురించి తెలిపిన పోలీస్ కళాబృందం కళాకారులకు జిల్లా సెషన్స్ జడ్జి ఎంజీ. ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సుజయ్ కుమార్, అదనపు డి సి పి శ్రీనివాస్, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్ రావు, అదనపు సీనియర్ సివిల్ జడ్జి అరుణ, రామడుగు మండలం న్యాయవాదులు కటకం రాజేందర్, ఉప్పుల అంజనీ ప్రసాద్, కట్టె కోలా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post