రాయి సెంటర్ ల ద్వారా సమస్యలను తెలుపవచ్చు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 28, 2021ఆదిలాబాదు:-

గిరిజన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున పీఎం ఆర్సీ భవనం ఉట్నూర్ లో రాయసెంటర్ ల సర్ మెడీలతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి భవేశ్ మిశ్రా, జిల్లా సర్ మెడి దుర్గు పటేల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాయి సెంటర్ లో సర్ మెడి లు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి తన పరిధిలోని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తానని, తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వానికి విన్నవిస్తానని తెలిపారు. రాయి సెంటర్ ల ద్వారా సమస్యలను తెలుపవచ్చని, ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా చూస్తామని తెలిపారు. భూములకు సంబంధించిన వాటి వివరాలు గిరిజన ప్రాంతాల్లోని తహసీల్దార్ ల నుండి తెప్పించుకుని పరిశీలిస్తామని తెలిపారు. ధరణీ పోర్టల్ లో, మీ సేవా కేంద్రాలలో భూములకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. భూములు సాగుచేస్తున్న వారికి పట్టాలు, రైతుబంధు వర్తించేవిధంగా వ్యవసాయ అధికారులకు ఆదేశిస్తామని తెలిపారు. కరోనా వలన గత 2 సంవత్సరముల నుండి పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు మూత బడ్డాయని, అయినప్పటికి ఆన్లైన్ క్లాసులు, ఇంటింటికి సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోని గ్రామాలలో సింగల్ పేజీ ఉన్న గ్రామాలకు త్రీ పేజ్ సౌకర్యం, కరంట్ లేని గ్రామాలకు సింగిల్ ఫేజ్ సౌకర్యం కల్పించేందుకు పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. మళ్ళి డిసెంబర్ లో జరిగే సమావేశం నాటికి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. పలువురు సర్ మెడి లు మాట్లాడుతూ, వర్షాలవలన దెబ్బతిన్న రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కల్పించాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాలని కోరారు. రెవెన్యూ పట్టా ఉండి చనిపోయిన వారసులకు విరాసత్ పట్టా ఇప్పించాలని, వారికి రైతుబంధు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి రాయి సెంటర్ కు భవనం నిర్మించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని లాంటి పలు సమస్యలను తెలిపారు. ఈ సమావేశంలో ఎపిఓ జనరల్ భీం రావ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రమేష్, ఎపిఓ రమణ, ఏవో రాంబాబు, వివిధ శాఖల అధికారులు, 34 రాయి సెంటర్ల సర్ మెడి లు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post